ముంబై: రైలు పట్టాలపై నుండి ఫ్లాట్‌ఫామ్ పై ఎక్కేందుకు వృద్దుడికి సహాయం చేసిన పోలీస్ కానిస్టేబుల్... రైల్వే ఫ్లాట్ ఫామ్ కి చేరుకొన్న వృద్ధుడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ఈ నెల 1వ తేదీన ముంబైలోని దాహిసర్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్ లోని సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్దుడిని కాపాడిన కానిస్టేబుల్ ను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు.

ఓ 60 ఏళ్ల వృద్దుడు ఒక ఫ్లాట్ ఫామ్ నుండి మరో ఫ్లాట్ పామ్ పైకి వెళ్లేందుకు రైలు పట్టాలపై వెళ్తున్నాడు. అదే సమయంలో అతని చెప్పు పట్టాలపై జారిపోయింది. రైలు పట్టాలపై వృద్దుడు ఉన్న సమయంలో అదే ట్రాక్ పై  రైలు వస్తోంది.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అక్కడికి పరుగెత్తాడు.  మరో రైల్వే ట్రాక్ వైపు వెళ్లాలని సూచించాడు. రైల్వే ఫ్లాట్ ఫామ్ వైపు రావొద్దని హెచ్చరించాడు. అలా వస్తే ట్రైన్ వచ్చే అవకాశం ఉందని కోరాడు.

కానీ పోలీస్ కానిస్టేబుల్ హెచ్చరికను వృద్దుడు పట్టించుకోలేదు. ట్రాక్ పై పడిన చెప్పును తీసుకొని ఫ్లాట్ పామ్ వైపునకు వచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ట్రైన్ వృద్దుడి వైపు దూసుకొచ్చింది.

వెంటనే సాహసం చేసిన కానిస్టేబుల్  ఎస్బీ నిక్కం ఆ వృద్దుడిని  చేయి పట్టుకొని ఫ్లాట్ ఫామ్ వైపునకు లాగాడు. ఆ వృద్దుడు ఫ్లాట్ ఫామ్ పైకి క్షేమంగా చేరుకొన్న తర్వాత చెంపపై వాయించాడు.

రైల్ పట్టాలపై నడవొద్దనే నిబంధనను 60 ఏళ్ల వృద్దుడు ఉల్లంఘించాడు. ఈ వృద్దుడిని గణపత్ సోలంఖిగా గుర్తించారు. కొన్ని మీటర్ల దూరంలో రైలు ఉన్న సమయంలో ట్రాక్ దాటేందుకు సోలంకి ప్రయత్నించాడు. అయితే కానిస్టేబుల్ సాహసంతో సోలంకి ప్రాణాలతో బయటపడ్డాడు.

గత ఏడాది అక్టోబర్ లో ముంబైలోని ఘట్కోపర్ రైల్వేస్టేషన్ లో ఓ మహిళను ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. రైలు ఎక్కే సమయంలో ఆమె కిందపడిపోతుండగా కానిస్టేబుల్ కాపాడిన విషయం తెలిసిందే.