Raj Thackrey: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్ థాక్రేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)  ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)తో ఎలాంటి పొత్తులు పెట్టుకునే అవ‌కాశంలేద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  

Mumbai civic polls: మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు హీటు పెంచుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, శివ‌సేన‌, దాని రెబ‌ల్ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం ముదురుతోంది. త్వ‌ర‌లో ముంబ‌యిలో లోక‌ల్ బాడీ ఎలక్ష‌న్స్ జ‌ర‌గున్నాయి. దాని కోసం ఇప్ప‌టికే పార్టీలు గెలుపు కోసం వ్యూహాల‌తో ముందుకుసాగుతున్నాయి. పొత్తులు పెట్టుకునే విష‌యంలో కూడా ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదివ‌ర‌కు మ‌హారాష్ట్రలో కాంగ్రెస్, శివ‌సేన, ఎన్సీపీల సంకీర్ణ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ప్ర‌భుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అయితే, దీనికి వెనుక బీజేపీ ఉంద‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. బీజేపీ, ఎంఎన్ఎస్ లు క‌లిసి ముందుకు సాగుతాయ‌నే విధంగా సంకేతాలు క‌నిపించాయి. 

అయితే, రానున్న పౌర ఎన్నిక‌ల్లో ఎంఎన్ఎస్ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌నుంద‌ని స‌మాచారం. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకులు ఇటీవల సమావేశం ముంబై సివిక్ ఎన్నికల కోసం చ‌ర్చించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే పుకార్లకు ముగింపు పలికే విధంగా నాయ‌కులు నిర్ణ‌యం తీసుకున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని ఈ స‌మావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయ‌ని ఇండియా టుడే నివేదించింది. ఈ సమావేశంలో ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ థాక్రే.. రాబోయే ఎన్నికలలో పొత్తుతో సహా పలు అంశాలపై వ్యాఖ్యానించారని వర్గాలు తెలిపాయి.

శివ‌సేన రెబ‌ల్ నాయ‌కుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు క్ర‌మంలో చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు, అనంత‌రం శివసేన గుర్తును ఎన్నిక‌ల సంఘం స్తంభింపజేసిన తర్వాత మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక్రేకు సానుభూతి లభిస్తోంది. ప్ర‌జ‌ల్లో కొంచే వారి ప‌ట్ల సానుకూలం స్పంద‌న ఉంద‌నీ, అయితే, ఎన్నిక‌ల్లో ఇది వారికి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌లిగించ‌క‌పోవ‌చ్చున‌ని రాజ్ థాక్రే ఈ స‌మావేశంలో చెప్పిన‌ట్టు మూలాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారనీ, సానుకూల దృక్పథంతో ఎన్నికల్లో పోరాడాలనీ, ఎంఎన్ఎస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని పార్టీ కార్యకర్తలను రాజ్ థాక్రే కోరారు.

రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని ఎంఎన్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ చీఫ్ రాజ్ థాక్రే సూచించారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలే అధికారంలో ఉంటారని ఆయ‌న అన్నారు. కాగా, గత కొన్ని నెలలుగా, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మ‌హారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే రాజ్ థాక్రేతో నివాసంలో సమావేశం కావడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చని ఊహాగానాలు చెలరేగాయి.