Asianet News TeluguAsianet News Telugu

తండ్రి ఫొటో పట్టుకుని మండపానికి పెళ్లి కూతురు.. ఎందుకంటే? (వీడియో)

ఆమె తొమ్మిదవ ఏటలోనే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తండ్రిని గుర్తు చేసుకుంటూనే తాత దగ్గర పెరిగింది. ఆ తర్వాత తాత అనుమతితో లండన్‌కు వెళ్లింది. ఇటీవలే పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లిలో తండ్రి లేకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అందుకే తండ్రి ఫొటోను ఒడిలో పెట్టుకుని మండపానికి నడిచి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

mumbai bride brings late father portrait to mandap
Author
First Published Oct 6, 2022, 6:41 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి అనేది జీవితంలో విలువైన ఘట్టం. ప్రతివారి జీవితంలో పెళ్లికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి తప్పకుండా కన్నవాళ్లు, ఆప్తులు, మనసుకు దగ్గర ఉన్న ప్రతి బంధువు, మిత్రులు ఉండాలని ఆశ పడతారు. కుటుంబ బంధాల్లో తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ చాలా మందికి తెలిసే ఉంటుంది. కూతురి ఎదుగుదలకు తండ్రీ సాధ్యమైన తోడ్పాటు ఇస్తూనే.. మానసికంగానూ ఆమెను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దుతాడు తండ్రీ. అలాంటి తండ్రిని పెళ్లిలో తప్పక ఉండాలని కుమార్తె అనుకోకుండా ఉంటుందా? కానీ, అప్పటికే తండ్రి మరణిస్తే? ఆ కుమార్తె మనసులో కలిగే బాధను అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ కుమార్తె.. మరణించిన తన తండ్రి ఫొటోను మండపానికి తీసుకుని వెళ్లింది. తోడుగా తండ్రి వాళ్ల తండ్రి అంటే తాతయ్యను తీసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఈ వీడియోను పోస్టు చేశారు. లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన ప్రియాంక అనే యువతి ఈ ఏడాది జులైలో పెళ్లి చేసుకుంది. ఆ పోస్టు క్యాప్షన్‌లో తన తండ్రి గురించి ఆమె పేర్కొంది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డాడని వివరించింది. చివరి రెండు సంవత్సరాలు మంచానికే పరిమితం అయ్యాడని, ఆ సమయంలోనూ ప్రతి రోజూ తన గురించి ఆరా తీసేవాడని తెలిపింది. 

తొమ్మిదేళ్ల వరకు తండ్రి తనను పెంచాడని, తనకు ఎంతో ఇష్టమైన మామిడిపళ్లు తెచ్చేవాడని, ఇష్టమైన టాయ్స్ కొనిచ్చేవాడని ఆమె గుర్తు చేసుకుంది. ఆ తర్వాత తాతయ్య తనను పెంచాడని వివరించింది. ఈ సందర్భంగా తన తాత తనకు ఇచ్చిన అమూల్యమైన బహుమతిని ఆమె గుర్తు చేసుకున్నారు. లండన్ వెళతానని ఆమె ప్రతిపాదించగా తన తాతయ్య అనుమతించాడని.. అదే తనకు అమూల్యమైన బహుమానం అని వివరించింది. అంతేకాదు, తన జీవిత భాగస్వామిని కూడా సొంతంగా చూసుకోమని చెప్పాడని తెలిపింది.

ప్రియాంక ఆ తర్వాత ప్రేమలో పడింది. జులైలో పెళ్లి చేసుకుంది. వైభవంగా పెళ్లి చేసుకుంటున్నది.. కానీ, తండ్రి లేడనే బాధ ఆమెలో క్షణక్షణం మెదిలింది. తన తండ్రికి నివాళిగా మండపానికి తండ్రి ఫొటోను తీసుకుని తాతయ్యతో నడుచుకుంటూ వెళ్లింది. ఇప్పుడు అవసరమా ఈ ఫొటో? అని కొందరు బంధువులు పేర్కొన్నా.. వాటిని ఆ తాత మనవరాళ్లు ఖాతరు చేయలేదు.

కన్నీటితో ఆమె తన పెళ్లి మండపానికి చేరుకుంది.

ఈ వీడియోకు 7లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఆమె స్టోరీకి కనెక్ట్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios