మనలో మన మాట... ఒక వేళ మీకు పాము కరిచిందే అనుకోండి ఏం చేస్తారు...? మీకు నిజంగా పాము కరవాలనేది మా అభిప్రాయం కాదు కానీ... ఎవరికి పాము కరిచినా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీస్తారు అవునా..? కానీ ఇద్దరు తల్లీ కూతుళ్లు చేసిన పని మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. తమను కరిచిన పాముని చేతితో పట్టుకొని మరీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయిలోని మహారాష్ట్ర నేచర్ పార్క్ సమీపంలో ఓ కుటుంబం నివసిస్తోంది. కాగా... ఆ పార్క్ లోకి వచ్చిన ఓ పాము... అనుకోకుండా ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అందులో ఉంటున్న  సుల్తానా ఖాన్(32), ఆమె కుమార్తె  తహసీన్ లను పాము కరిచింది.

ముందు తహీసన్ ఎడమ చేతిపై పాము కాటు వేసింది. ఆమె తొలుత ఎలక కరిచిందేమోనని అనుకుంది. తీరా చూస్తే పాము కనిపించే సరికి భయపడింది. దీంతో వెంటనే సుల్తానా ఖాన్ ఆ పాముని పట్టుకుంది. ఆ క్రమంలో  అదే పాముసుల్తానా ఖాన్ ని కూడా కరిచింది. అయినా కూడా ఆమె ఆ పాముని వదిలిపెట్టలేదు. అలానే పట్టుకొని కూతురిని తీసుకొని.. క్యాబ్ లో హాస్పిటల్ కి వెళ్లింది. 

తమను కరిచిన పాము ఇదే అని డాక్టర్ కి చూపించి... ఆ తర్వాత తల్లీ కూతుళ్లు ఇద్దరూ వైద్యం చేయించుకున్నారు. అయితే... ఏ పాము కరిచిందో చూడటం వల్లనే సరైన వైద్యం చేయగలిగామని డాక్టర్లు చెప్పడం గమనార్హం.

దీనిపై సుల్తానా ఖాన్ ని ప్రశ్నించగా... ఏ పాము కరిచిందో తెలియకపోతే చికిత్స చేయడం కష్టమౌతుందని తాను ఎక్కడో చదివానని అందుకే ఆ పాముని అలానే పట్టుకొని ఆస్పత్రికి తీసుకువచ్చానని ఆమె చెప్పడం గమనార్హం. తల్లీ కూతుళ్లు ఇద్దరినీ మరో మూడు రోజులు తమ పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఆ పాము రెండు అడుగులపైనే పొడవు ఉందని స్థానికులు చెప్పారు.