జమ్ము కశ్మీర్‌లో ముంబయి దాడి తరహా అటాక్‌కు కుట్ర పన్నినట్టు భద్రతా బలగాలకు తెలిసింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న.. పాకిస్తాన్ ఐఎస్ఐతో నేరుగా కనెక్షన్లు ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం తెలిసింది. దీంతో జీ20 ప్రతినిధుల ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. వారు వెళ్లే దారిని మార్చడంతోపాటు వారుండే హోటల్‌లో సెక్యూరిటీని మరింత పెంచారు.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో 26/11 తరహా దాడికి కుట్ర పన్నినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఈ దాడికి కుట్ర పన్నినట్టు సమాచారం అందడం గమనార్హం. దీంతో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కాన్ఫరెన్స్ రూట్ మ్యాప్‌లో చివరి నిమిషంలో మార్పులు చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచనలతో గుల్మార్గ్ ఏరియాలో జీ20 సమావేశం జరుగుతుండగా ముంబయి దాడి తరహాలోనే అటాక్ చేయాలనే కుట్ర పన్నినట్టు ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాది తెలిపారు.
ఓ విలాసవంతమైన హోటల్‌లో పని చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. ఆందోళనకర విషయాలను వెల్లడించాడు. ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్ వెల్లడించిన విషయాలతో జీ20 వేదిక చుట్టూ సెక్యూరిటీని పెంచారు. అంతేకాదు, అనుమానాస్పదంగా కనిపించే అంతర్జాతీయ నెంబర్ల ద్వారా ఏ సందేశాలు వచ్చినా.. కశ్మీర్ లోయలో జీ20 సదస్సు గురించి ఎలాంటి వదంతులు పేర్కొన్నా విశ్వసించరాదని కశ్మీర్ పోలీసులు సూచనలు చేశారు.
ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ టెర్రరిస్టులకు పరోక్షంగా సహకరిస్తుంటారు. డబ్బు, ఆశ్రయం, లేదా ఇతర సౌకర్యాల వంటి లాజిస్టికల్ సపోర్ట్‌ను ఇస్తుంటారు. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే ముహమ్మద్‌లు ఇలాంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్‌ను సాధారణంగా జమ్ము కశ్మీర్‌లో ఉపయోగించుకుంటూ ఉంటుంది.
భద్రతా బలగాలు ఏప్రిల్ చివరి వారంలో ఫరూఖ్ అహ్మద్ వణిని అరెస్టు చేశారు. జీ20 సమావేశానికి ముందు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టు జరిగింది.
బారాముల్లాలోని సోపోర్ హైగామ్‌కు చెందిన వణి గుల్మార్గ్‌లోని ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన టెర్రరిస్టు సంస్థతో సంబంధంలో ఉన్నాడని, ఓ ఉగ్రవాద సంస్థకు ఓజీడబ్ల్యూగా పని చేస్తున్నాడని కొన్ని వర్గాలు వివరించాయి. ఆయన ఐఎస్ఐ అధికారులతో నేరుగా టచ్‌లో ఉన్నాడని ఆ వర్గాలు తెలిపాయి.
వణిని విచారిస్తుండగా జీ20 ప్రతినిధులు ఉండే హోటల్‌లోకి ప్రవేశించాలనేది ఉగ్రవాదుల లక్ష్యమని చెప్పాడని తెలిసింది. అక్కడున్న వారిపై, విదేశీ ప్రతినిధులనూ వారు టార్గెట్ చేసుకుంటారని వణి చెప్పినట్టు సమాచారం. ముంబయి దాడిలో తాజ్ హోటల్‌ను ఎలాగైతే అధీనంలోకి తీసుకున్నారో.. అదే తరహా జీ20 ప్రతినిధులు ఉండే హోటల్‌నూ అధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడని తెలిసింది.
కశ్మీర్‌లో జీ20 సదస్సు జరుగుతుండగా మరో రెండు, మూడు చోట్ల ఏకకాలంలో దాడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్టు ఓజీడబ్ల్యూ చెప్పాడని కొన్ని వర్గాలు వివరించాయి. కాబట్టి, కశ్మీర్ ముఖ్యంగా శ్రీనగర్‌లో అన్ని కదలికలను పసిగట్టడానికి సీసీటీవీ, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నాయి.
