ముంబై: లైంగిక వేధింపుల నుండి యజమానిని ఓ కుక్క కాపాడింది.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది. 

ముంబైలోని పొవాయి ప్రాంతంలో 33 ఏళ్ల మహిళ తన ఏడేళ్ల కూతురితో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.  ఆమె ఓ కుక్కను కూడ పెంచుకొంటుంది. ఇటీవలనే ఆమె భర్త మరణించాడు.

ఇదే ప్రాంతానికి చెందిన సర్దార్ ఆలం అనే 25 ఏళ్ల వ్యక్తి ఆమెతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తిరస్కరించింది.దీంతో ఆమెపై కక్షగట్టిని ఆలం ఆమెపై అత్యాచారం చేయాలని ప్లాన్ చేశాడు. బాధితురాలి ఇంట్లోకి ఒంటిపై చొక్కా లేకుండా ఇంటి కిటీకి గుండా లోపలికి ప్రవేశించాడు.

అయితే ఈ విషయాన్ని గమనించిన కుక్క వెంటనే బిగ్గరగా అరవడం ప్రారంభించింది. వెంటనే నిద్ర లేచిన ఆమె ఆలం తన ఇంట్లోకి  వచ్చిన విషయాన్ని గుర్తించింది.

వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఆ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.