18 ఏళ్లు పైబడినవారికి ముంబైలో మే 1 నుంచి నో కరోనా టీకా: కారణం ఇదీ...
18-45 ఏళ్ల మధ్య వయస్సుగలవారికి మే 1 నుంచి కరోనా టీకాలు వేసే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని బీఎంసీ ఉన్నతాధికారి ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు పైబడినవారికి కరోనా టీకా ఇచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కరోనా వ్యాక్సిన్స్ కొరత కారణంగా మే 1వ తేదీ నుంచి కరోనా టీకా ఆ వయస్సువారికి ఇవ్వబోమని ఓ ఉన్నతాధికారి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
తగినన్ని కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతనే 18 ఏళ్ల వయస్సు పైబడినవారికి టీకా ఇస్తామని, మే 1వ తేదీ నుంచి మాత్రం ఇవ్వబోమని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అదనపు కమిషనర్ అశ్విని బిందే ట్వీట్ చేశారు. అయితే వయోజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
తగినన్ని వాక్సిన్ నిల్వలు వచ్చిన తర్వాత వాక్సినేషన్ ప్రారంభమవుతుందని, క్యూలో నిలుచోవాల్సిన అవసరం లేకుండా టీకా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు మరిన్ని వివరాలు అందిస్తామని, జాగ్రత్తగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు
వాక్సిన్ కోసం గుమికూడదవద్దని, పొడువైన క్యూల్లో నిలుచోవద్దని ఆమె సీనియర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి మాత్రమే వాక్సిన్ కొరత ఉదని, అన్ని ప్రదేశాల్లో తగినంత లేదని, 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి కచ్చితంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి కరోనా టీకాలు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత కూడా 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి టీకాలు ఇచ్చే ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. కొత్త దశ టీకాల కార్యక్రమం కోసం బీఎంసీ మరో 500 ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అందువల్ల 45 ఏళ్ల వయస్సు పైబడినవారికి కరోనా టీకాలను ఆపేసే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.