ప్రయాాగరాజ్ మహా కుంభమేళాకు వెళ్లే తెలుగోళ్లకు గుడ్ న్యూస్ ... ఆ సమస్య వుండదిక
2025 మహాకుంభ్‌కి వచ్చే భక్తుల కోసం ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లలో మొదటిసారిగా బహు భాషా ప్రకటనల ఏర్పాటు చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు 10 ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఉంటాయి.
ప్రయాగరాజ్ : 2025 మహా కుంభమేళా ప్రయాగరాజ్ వాసులకే కాదు భక్తులు, పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగిల్చనుంది. దివ్య, భవ్య, పరిశుభ్రమైన, సురక్షితమైన, సులభతరమైన కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే దేశ నలుమూలల నుండి నుండి భక్తుల కోసం ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ సరికొత్త ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే శాఖ బాషా పరమైన ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇలా మొదటిసారిగా బహుళ భాషా ప్రకటనలు ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రైళ్ల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.
భక్తులకు మరింత సులభతరం
సులభతరమైన, సురక్షితమైన మహా కుంభమేళా నిర్వహణే లక్ష్యంతో ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ ఈ వివిధ బాషల్లో సమాచారాన్ని అందించే ఏర్పాటు చేసింది. స్టేషన్ల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. 2025 మహాకుంభ్‌లో మొదటిసారిగా బహుళ భాషా ప్రకటనలు చేపడుతున్నట్లు ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ సీనియర్ పీఆర్‌ఓ అమిత్ మాల్వీయ తెలిపారు. హిందీ, ఇంగ్లీష్ తెలియని భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
10 ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు
ప్రధాన స్టేషన్లలో బహుళ భాషా ప్రకటనల ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ పీఆర్‌ఓ తెలిపారు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, పంజాబీ భాషల్లో ప్రకటనలు ఉంటాయి. ఈ భాషల్లో ప్రకటనలు చేసేందుకు వివిధ డివిజన్ల నుండి అనౌన్సర్లను రప్పిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, ఆశ్రయ స్థలాల్లో కూడా స్పీకర్లు ఏర్పాటు చేస్తారు. భక్తుల గమ్యస్థానాలను బట్టి ఆశ్రయ స్థలాల్లో వారిని ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా వుంటారు.