ములాయం సింగ్ యాదవ్ ఈ రోజు ఉదయం హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. మూడు సార్లు యూపీకి సీఎంగా చేసిన ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వారసత్వాన్నే కాదు.. పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా ఇచ్చి వెళ్లారు. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం రూ. 20 కోట్లకు పైనే ఆయన ఆస్తులు ఉన్నాయి. 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ 82 ఏళ్ల వయసులో గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. సైఫైలో 11వ తేదీన ఆయన అంతిమ క్రియలు నిర్వహిస్తారు.మూడు సార్లు సీఎంగా చేసిన ములాయం సింగ్ యాదవ్ గొప్ప రాజకీయ వారసత్వాన్నే కాదు.. కోట్ల సంపదను కూడా వారసత్వంగా విడిచిపెట్టి వెళ్లారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) ఆయన ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నది. 2019 వరకు ములాయం సింగ్ యాదవ్ దగ్గర ఆస్తులు సుమారు రూ. 20 కోట్లకు పైగానే ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది.

నెట్ వర్త్ ఎంతంటే?

2019 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. దాని ప్రకారం, రూ. 16,52,44,300ల ఆస్తులు ఉన్నట్టు వివరించారు. ఈ స్థిరాస్తులతోపాటు కొన్ని చరాస్తులనూ ప్రస్తావించారు. అలాగే, తన భార్యకు ఏడాదికి రూ. 32.02 లక్షల వార్షికాదాయం ఉన్నదని వివరించారు. ఆ నేత ఆస్తులు రూ. 20,56,04,593 అని, సుమారు రెండు కోట్ల అంటే రూ. 2,20,55,657 కోట్ల లయాబిలిటీలు ఉన్నట్టు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్ ప్రకారం ఆయన ఆదాయం రూ. 32,02,615గా ఉన్నది.

బ్యాంకు డిపాజిట్లు, బంగారం

ములాయం సింగ్ యాదవ్ దగ్గర అప్పుడు రూ. 16,75,416 నగదు, రూ. 40,13,928లు బ్యాంకు, ఇతర సంస్థల్లో డిపాజిట్లు చేసి ఉన్నాయని రిపోర్టు తెలిపింది. రూ. 9,52,298ల విలువైన ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి ఆయన దగ్గర మొత్తం సుమారు 7.50 కిలోల బంగారం ఉన్నది. దీని విలువ సుమారు రూ. 2,41,52,365. రూ. 7,89,88,000ల విలువైన వ్యవసాయ భూమి ఉన్నది. రూ. 1,44,60,000ల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నది. యూపీలో ఆయన నివాసానికి ధర రూ. 6,83,84,566 పలుకుతుంది.

కార్లు లేవు

ములాయం సింగ్ యాదవ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అతనికి ఏ కారు లేదని వివరించారు. ఆయన కొడుకు అఖిలేశ్ యాదవ్ నుంచి రూ. 2,13,80,000ల మేరకు లోన్ తీసుకున్నారు.