ఉల్లి ఘాటు నశాలానికి ఎక్కుతోంది. సామాన్య ప్రజలు ఉల్లి కొనలేని స్థాయికి వెళ్లిపోయింది. ఉల్లి ధర అమాంతం పెరగడంతో.. రైతుల్లో ఆనందం కన్నా ఆందోళన ఎక్కువైంది. ఎప్పుడు ఎవరు వచ్చి ఉల్లి దొంగతనం చేస్తారా అన్న కంగారు మొదలైంది. ఇప్పటికే చాలాచోట్ల ఉల్లి చోరీలు జరగగా... తాజాగా... మధ్యప్రదేశ్ లో రూ.30వేలు విలువచేసే ఉల్లిని చోరీ చేశారు.

ఒక రైతు పొలంలోని రూ. 30 వేలకుపైగా ఖరీదు చేసే ఉల్లిపంటను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ అధికారి ఆర్‌ఎస్ బిల్వాలా ఈ ఉదంతంపై మాట్లాడుతూ జిల్లాలోని రిఛా బచ్చా గ్రామానికి చెందిన రైతు జితేంద్ర కుమార్ తన ఉల్లి పొలంలో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశాడన్నారు. 

అజ్ఞాతవ్యక్తులు అతని పొలంలోని ఏడు క్వింటాళ్ల ఉల్లిని చోరీ చేశారన్నారు. దీని ఖరీదు రూ. 30 వేలు ఉంటుందన్నారు. కాగా ఆ రైతు తన ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం ఇంకా పరిపక్వానికి రాని ఉల్లిపాయలను వాటి కాడలతో సహా దోచుకుపోయారని ఆరోపించాడు. కాగా ప్రస్తుతం ఉల్లి కిలో రూ. 80 నుంచి 100 వరకూ పలుకుతోంది.