బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ వేదికగా చురకలు వేశారు. మీ నాన్న, అలాంటి మరికొంతమంది రాజవంశీకుల వల్లే దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఢిల్లీ : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా చురకలు వేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి.. ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఊటంకిస్తూ ట్వీట్ చేశారు.
జీవితంలో ఎన్నడూ పని చేయనవసరం లేని రాజవంశీయులు, ఎల్లప్పుడూ లక్ష్యాలను, ఆశయాలను, శ్రమను వెక్కిరిస్తుంటారు అన్నారు. భారతదేశం చైనా కంటే వెనుకబడి ఉంటే, అది ఆమె తండ్రి, అలాంటి ఇతర రాజవంశాల వారు చేసిన దశాబ్దాల రాజకీయాల కారణంగానే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో, ఆయన కృషితో భారతదేశం నేడు తన ఆశయాలను సాధించే దిశగా క్రమంగా పుంజుకుంటోంది అని చెప్పారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల్ని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. దాంట్లో.. ఎమ్మెల్సీ కవిత.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మన పోటీ చైనాతో ఉందని, చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉందని పదే పదే చెప్పే నిర్మలా సీతారామన్‌ను నేను అడగాలనుకుంటున్నాను. మన లక్ష్యం 5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఎందుకు, మనకు అధిక శ్రామిక జనాభా, వనరులు చాలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత లక్ష్యాన్ని సాధించడం లేదు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత ప్రశ్నించారు.
