దేశంలో విద్వేష ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పడటానికి ప్రధాని మోడీ స్వయంగా బహిరంగంగా మాట్లాడాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ, ఆయన తప్పా మిగత నేతలు మాట్లాడుతారని, వారి మాటల ప్రభావం క్షేత్రస్థాయిలో పడదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాల టాపిక్ మరోసారి తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విద్వేష ప్రసంగంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ విద్వేష ప్రసంగాలకు (ఎవరు ఇచ్చినా..) ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సమాధానం ఇచ్చారు. ఇలా విద్వేష ప్రసంగాలు వచ్చినప్పుడు ఇతరులంతా మాట్లాడతారని, కానీ, ప్రధాని మోడీ మౌనంగా ఉంటారని ఒవైసీ అన్నారు. కాబట్టి, క్షేత్రస్థాయిలో ఇతరులు సరిదిద్దడానికి చేసే ప్రయత్నాల ప్రభావం ఉండదని వివరించారు. ప్రధాని మోడీ మాట్లాడితే.. ఈ ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పడవచ్చని తెలిపారు.
ఢిల్లీలో ఓ బహిరంగ సమావేశంలో ఓ కమ్యూనిటీ (ముస్లిం?) మొత్తాన్ని బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, సభకు అనుమతి ఇవ్వలేదని కేసు పెట్టినా.. విద్వేష ప్రసంగంపై కేసు పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్డీటీవీతో మాట్లాడారు.
పార్లమెంటులో వినిపించే కొన్ని గుసగుసలను బట్టి చూస్తే.. ఆ బీజేపీ ఎంపీ పర్వేశ్.. ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉంటారని, ప్రధాని మోడీ నుంచి ఆశీస్సులు, ఇతర సహకారాలు ఆయనకు ఉన్నాయని ఒవైసీ అన్నారు. అందుకే ఆయన నిర్భయంగా ఈ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు.
Also Read: వాళ్ల చేతులు, తలలు నరికేయండి.. లైసెన్స్ లేకున్నా గన్ తీసుకోండి: వీహెచ్‌పీ ర్యాలీలో విద్వేషం
‘నరేందర్ మోడీ అందరికీ ప్రధానినే. కేవలం ఆయనకు ఓటు వేసినవారికే కాదు.. విద్వేషపూరిత హిందుత్వ ఐడియాలజీని అనుసరిస్తున్నవారికే కాదు. కానీ, దురదృష్టవశాత్తు ప్రధాని మాట్లాడరు. ఇతరులు మాట్లాడినా వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో ఉండవు’ అని ఒవైసీ అన్నారు.
‘బీజేపీ ప్రతినిధులకు వ్యతిరేకంగా పోలీసులు ఎప్పుడూ చర్యలు తీసుకోరు. ఇది ఎప్పుడూ కనిపించే అంశమే. ఊచకోత గురించి పిలుపు ఇచ్చేవారికి అధికారిక అండదండలు అందించేలా బీజేపీ ఓ పాలసీ చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో అల్లర్లు మొదలు కావడానికి ముందు ఈ ప్రతినిధే (బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ) మాట్లాడారు’ అని వివరించారు.
