ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగిదంట. అదేంటి ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానం మీకు కలగొచ్చు. కానీ ఇది నిజం ఎవరెస్ట్ ఎత్తు పెరిగినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

తాజా సర్వే ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది. 2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న అనుమానాల నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన సాంకేతికత, ఇతర అవసరాల కోసం నేపాల్ సర్కారు చైనా సాయం తీసుకుంది.

చైనా సహకారంతో నిర్వహించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దీనినే ఆమోదిస్తున్నారు.

తాజాగా నేపాల్‌ సర్వేలో ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, ప్రస్తుతం దాని ఎత్తు 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో సంయుక్తంగా ఈ వివరాలను ప్రకటించారు.