కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళను ఆమె భర్త ఇంటి నుంచి బయటకు గెంటివేయడం విచిత్రంగా  మారింది. ఎందుకంటే.. ఆ జంట ఇప్పటికే 10 మంది పిల్లలకు జన్మనిచ్చారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళను ఆమె భర్త ఇంటి నుంచి బయటకు గెంటివేయడం విచిత్రంగా మారింది. ఎందుకంటే.. ఆ జంట ఇప్పటికే 10 మంది పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఆ మహిళా భర్త మాత్రం.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందని ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఆ మహిళా మూడు రోజులుగా పిల్లలతో కలిసి చెట్టు కిందే ఆశ్రయం పొందుతున్నారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లా టెల్కోయ్ బ్లాక్‌లో సాలికేనా పంచాయతీలోని డెమిరియా గ్రామంలో చోటుచేసుకుంది. 

 వివరాలు.. గ్రామానికి చెందిన రవి దేహూరికి 16 ఏళ్ల క్రితం జానకితో వివాహం జరిగింది. రబీకి జానకి రెండో భార్య. రవి-జానకి దంపతులు ఇప్పటికే 11 పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒక పాప పుట్టిన తర్వాత మరణించింది. జానకి దాదాపు ప్రతి ఏడాదికి ఒక బిడ్డకు జన్మనిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిసారి గర్భం దాల్చిన తర్వాత జానకి అనారోగ్యం క్షీణిస్తూ రావడం, పిల్లల పెంపకం భారం కావడంతో.. ఆరోగ్య కార్యకర్తలు చొరవతో ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 

అయితే ఈ విషయం తెలుసుకున్న రవి.. జానకిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పితృ దేవతలకు పూజలు చేయడానికి అర్హత లేదంటూ ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ క్రమంలోనే ఆమె మూడు రోజులుగా పిల్లలతో కలిసి చెట్టు కిందే ఆశ్రయం పొందింది. అయితే ఒక ఆరోగ్య కార్యకర్త జానకిని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారు జానకి విషయంలో రవికి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే ఇక్కడ విషాదకరమైన విషయమేమిటంటే.. గ్రామస్థుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్న రవి తన పిల్లలకు సరైన ఆహారం అందించడం లేదని తెలుస్తోంది.

ఇక, కియోంఝర్ వంటి గిరిజన-ఆధిపత్య జిల్లాలలో మూఢనమ్మకాల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. ఇక్కడ చాలా చోట్ల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడాన్ని నిషిద్ధంగా పరిగణిస్తున్నారు.