కోల్ కతా: మూఢనమ్మకంతో ఓ మహిళ తన కన్నకొడుకునే అతి దారుణంగా చంపేసింది. తాంత్రిక పూజలు చేస్తే శక్తులు సిద్ధిస్తాయనే విశ్వాసంతో ఆ తల్లి కుమారుడిని హత్య చేసింది. కొడుకుని రోకలిబండతో కొట్టి చంపింది. ఆ తర్వాత శవానికి నెయ్యి, కర్పూరు, మసాలాలు పూసింది. 

అలా చేసి శవాన్ని ఇంట్లో దహనం చేసింది. ఈ ఘోరమైన సంగటన పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బదధాన్నగర్ లో వెలుగు చూసింది. నిందితురాలు గిత చిన్న కుమారుడు విదుర్ తో కలిసి పెద్ద కుమారుడు అర్జన్ (25)ను చంపింది. 

దహనం చేస్తే మాడువాసన రాకుండా ఉండడానికి శవానికి సుగంధ ద్రవ్యాలను పూసినట్లు విచారణలో తేలింది. గీతను, విదుర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మూఢ విశ్వాసానికి సంబంధించిన ఘటనే మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. పాతికేళ్ల యువకుడు శివాలయంలో గొంతు కోసుకుని శివలింగంపై అభిషేకం చేశాడు. అఘోరా శక్తుల సాధనకే అతడు ఈ పనిచేసినట్లు తేలింది. 

కువార్ వాడ్ గ్రామానికి చెందిన నందు పైథాన్ పట్టణంలో ఈ అవాంఛనీయమైన సంఘటనకు పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతను మరణించాడు.