ఢిల్లీలో దారుణం జరిగింది. ఇంటిని గ్యాస్ చాంబర్ గా మార్చి తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు గాలి వెళ్లకుండా కిటికీలు, వెంటిలేటర్లు అన్నీ కవర్ చేసుకుని గ్యాస్ నాబ్ ఓపెన్ చేశారు. ఆ విషవాయువులు పీల్చుకునే మరణించారు. ఈ గదిలోకి ఎంటర్ కాగానే జాగ్రత్తలు, హెచ్చరికలు చూస్తూ సూసూడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం.

న్యూఢిల్లీ: దేశరాజధానిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు కలిసి దక్షిణ ఢిల్లీలోని తమ నివాసాన్ని గ్యాస్ చాంబర్‌గా మార్చుకున్నారు. లోపలి నుంచి గాలి బయటకు పోకుండా కిటికీలు, వెంటిలేటర్లు సమస్తాన్ని మూసేశారు. కిచెన్‌లోని గ్యాస్ మొద్దు నాబ్ ఓపెన్ చేశారు. వారికి సమీపంలో బొగ్గుల కుంపటి పెట్టుకుని బొగ్గులను నిప్పు కణికలు చేసుకున్నారు. అందులో నుంచి వచ్చే పొగ, ఎల్పీజీ గ్యాస్ కలగలసి ప్రాణాంతక వాయువులుగా మారాయి. వీటి మిశ్రమం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడింది. ఈ వాయువుల కారణంగా ఇంటిలోని తల్లి, ఇద్దరు బిడ్డలు ప్రాణాలు వదిలారు. ఆ ఇంటి డోర్ తీయగానే ఎదురుగా ఉంచిన సూసైడ్ నోట్‌లో హెచ్చరికలు రాసి ఉండటం గమనార్హం. ఇల్లు మొత్తం ప్రాణాంతక వాయువులు ఆవరించి ఉన్నాయని, ఇవి మంటలను రేపగలవని, కాబట్టి, అగ్గిపెట్టె, క్యాండిల్స్ వంటివేవి వెలిగించకూడదని సూచనలు ఓ సూసైడ్ నోట్‌లో కనిపించాయి.

వాసంత్ విహారిలోని 207 నెంబర్‌తో గల ఓ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇంటిలో మూడు మృతదేహాలు లభించాయి. ఆ ఇంటిలో గాలి వెలుపలికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెచ్చుకున్న కవర్‌లను పేస్ట్ చేశారు. లోపలి నుంచి గ్యాస్ బయటకు వెళ్లకుండా కవర్ చేశారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ నాబ్ ఓపెన్ చేసినట్టు తెలుస్తున్నది. ఆ గ్యాస్ ల కారణంగా వారు మరణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ముగ్గురు మృతదేహాలు ఒకే బెడ్ రూమ్‌లో కనిపించాయి. అయితే, ఆ ఇంటి డోర్ తీయగానే ఎదురుగా ఇంగ్లీష్ రాసిన సూసైడ్ నోట్‌లో స్పష్టంగా హెచ్చరికలు వారు రాసి పెట్టారు. 

గదిలో టూ మచ్ డెడ్లీ గ్యాస్.. కార్బన్ మోనాక్సైడ్ ఉన్నదని వారు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ గ్యాస్ మంట రేపుతాయని తెలిపారు. ముందు ఈ రూమ్ నుంచి వాయువులు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోండని, కిటికీలు తీసుకుని ఫ్యాన్ లు వేయాలని సూచించారు. అగ్గిపెట్టే, క్యాండిల్ వంటి ఎలాంటివాటిని అంటిపెట్టరాదని వార్నింగ్ ఇచ్చారు. కర్టెయిన్‌లు తొలగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ రూమ్ మొత్తం ప్రమాదకర గ్యాస్ లు ఉన్నాయని వివరించారు.

మృతులను తల్లి మంజు శ్రీవాస్తవ, ఇద్దరు కూతుళ్లు అన్షిక, అంకులుగా గుర్తించారు.

స్థానికుల సమాచారం ప్రకారం, మంజు శ్రీవాస్తవ భర్త.. కుటుంబ యజమాని ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ గతేడాది కరోనా కారణంగా మరణించాడు. అప్పటి నుంచి వారి కుటుంబం తీవ్ర వేదనలో ఉన్నారు. ఆమె కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. అనారోగ్యం బారిన పడి మంచం పట్టారు. ఆ తర్వాత వారంతా మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. వారంతా కలిసికట్టుగా ప్రణాళిక బద్ధంగా ఆత్మహత్యకు పాల్పడటం విషాద తీవ్రతను వెల్లడిస్తున్నది.