చలి నుంచి రక్షించుకునేందుకు బొగ్గుల కుంపటి వెలిగించిన తల్లికొడుకులు ఊపిరి ఆడక దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్ జిల్లా హర్సవాకు చెందిన దేవేంద్ర ప్రభుత్యోద్యోగిగా పనిచేస్తున్నాడు.

అతని భార్య సంతోషి, కుమారుడు మనీష్ యాదవ్‌లు ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి చలి బాగా ఎక్కువగా ఉండటంతో వారు తట్టుకోలేకపోయారు. దీంతో చలి నుంచి రక్షించుకునేందుకు ఇంట్లో బొగ్గుల కుంపటిని వెలిగించి కాసేపటికి నిద్రపోయారు.

కుంపటి నుంచి విపరీతంగా వెలువడిన పోగ గది మొత్తం వ్యాపించింది. గాఢనిద్రలో ఉన్న వారికి ఊపిరాడకపోవడంతో అక్కడికక్కడే మరణించారు. తరువాతి రోజు ఇంటికి వచ్చిన దేవేంద్ర తలుపు తెరచి చూసేసరికి భార్యా, కుమారుడు నిర్జీవంగా పడివుండటం చూసి వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.