కోయంబత్తూరు: ముక్కూ మొహం తెలియని మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. వారం రోజులుగా ఫోన్ చేసి విసిగిస్తున్న వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు తల్లీకూతురు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన ధనలక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో తల్లి వద్దే వుంటోంది. అయితే ఇటీవల ఆమెకు పెరియసామి అనే వ్యక్తి కాల్ చేశాడు. రాంగ్ కాల్ కావడంతో ఆ విషయాన్నే చెప్పి ఆమె కట్ చేసింది. 

అయితే అవతల మహిళ మాట్లాడటంతో తిరిగి అదే నంబర్ కు కాల్ చేశాడు పెరియసామి. అంతేకాకుండా మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. దీంతో విసిగిపోయిన మహిళ ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. 

తల్లీకూతురు ఇద్దరు కలిసి వేధిస్తున్న వ్యక్తికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి రావాల్సిందిగా అతన్ని ఆహ్వానించారు. దీంతో అతడు వారి ఇంటికి రాగానే పట్టుకుని చెట్టుకు కట్టేసి మరీ చితకబాదారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతడు కొద్దిసేపటికి ప్రాణాలు వదిలాడు. అతడు చనిపోయినట్లు గుర్తించిన తల్లీకూతురు మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారు. 

అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు తల్లీ కూతురుపై  హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.