ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళతో పాటు ఏడేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ మృతదేహల శరీర భాగాలను వేరు చేసి అటవీ ప్రాంతంలో దహనం చేసి అత్యంత కౄరంగా వ్యవహరించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భారత్, నేపాల్ సరిహద్దులోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలో మైలానీ అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వీరు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. 

 ఓ నడివయస్సు మహిళతో పాటు ఓ చిన్నారిని  హత్య చేసి, శరీర భాగాలను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా, చిన్నారి ఇద్దరు తల్లీ కూతుళ్లు అయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.  పాక్షికంగా కాలిపోయిన స్థితిలో వున్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

సంఘటనా స్థలంవద్ద ఓ సెల్ ఫోన్, టిఫిన్ బాక్స్ లను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా  బాధితుల వివరాలతో పాటు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.