ఇటీవలి కాలంలో మోసం చేసి సొమ్ము చేసుకోవడంలో మగవారిని మించిపోతున్నారు కొందరు ఆడవాళ్లు.. వివాహాం పేరుతో అబ్బాయిల దగ్గర నగదును గుంజుకుని ఊడాయించే వారితో పాటు అందంతో ఎరవేసి..మత్తులో నిలువుదోపిడి చేసే కిలాడి లేడీలు గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం.

తాజాగా ఒకే ఇంటిని ఐదుగురు వ్యక్తులకు అమ్మి కోట్లు కొట్టేశారు ఘరానా తల్లీకూతుళ్లు. వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన మోలీ కపూర్, అనురాధ కపూర్ అనే ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లు... వీరు నగరంలోని గ్రేటర్ కైలాశ్ పార్ట్-1 అనే ఇంటిని ఐదుగురు వ్యక్తులకు అమ్మారు.

ఈ ఐదుగురిలో ఏ ఒక్కరికి మిగిలిన నలుగురి గురించి తెలియదు.. వీరి వద్ద నుంచి రూ.2.5 కోట్లు గుంజిన తల్లీకూతుళ్ల మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యూఫ్రెండ్స్ కాలనీలో ఘరానా లేడీలను పట్టుకున్నారు.

కాగా వీరిద్దరిపై 2014, 2015 సంవత్సరాల్లో పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. అనురాధ ఓ హత్య కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారని అధికారులు తెలిపారు. తాజా వ్యవహారంలో తల్లీకూతుళ్లను కోర్టు ముందు హాజరుపరిచి తీహార్ జైలుకు పంపించారు.