లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై  ప్రముఖ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.

కీలక బాధ్యతలు చేపట్టినందుకు ప్రియాంక గాంధీకి ప్రశాంత్ కిశోర్...అభినందనలు తెలిపారు. ఇది భారత రాజకీయాల్లోనే సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన సందర్భమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

‘‘భారత రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. ఆమె వచ్చిన సమయం, కచ్చితమైన పాత్ర, స్థానంపై సర్వత్రా చర్చిస్తున్నారు. అయితే నా వరకు నిజమైన వార్త ఏమంటే.. రాజకీయాల్లోకి దూకాలని ఆమె ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు. ప్రియాంక గాంధీకి అభినందనలు, శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు.