మహారాష్ట్రలోని అన్ని మసీదులు లౌడ్ స్పీకర్లు వినియోగించుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలమా-ఇ-హింద్ సంస్థ కోరింది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగుతుండటంతో ఆ సంస్థ ఈ మేరకు సూచనలు చేసింది.
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముస్లిం బాడీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని మసీదులకు జమియత్-ఉలమా-ఇ-హింద్ యూనిట్ విజ్ఞప్తి చేసింది.
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సోమవారం మహారాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. దీని ప్రకారం మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగించేందుకు తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర యూనిట్ జమియత్-ఉలమా-ఇ-హింద్ కార్యదర్శి గుల్జార్ అజ్మీ మీడియాతో మాట్లాడారు. ‘‘ రాష్ట్రంలోని చాలా మసీదులు లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం కోసం పోలీసు శాఖల నుండి అనుమతి తీసుకున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని మసీదులు వాటిని తీసుకోలేదు. కాబట్టి నేను ఆ మసీదులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో అజాన్ కోసం లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. ’’ అని చెప్పారు.
రాష్ట్రంలో పోలీసులు చాలా సహకరిస్తున్నారని గుల్జార్ అజ్మీ అన్నారు. అజాన్ కోసం పోలీసు శాఖ అనుమతి ఇస్తోందని చెప్పారు. లౌడ్ స్పీకర్ల సమస్యను పరిష్కరించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ న్యాయం చేయడానికి కృషి చేస్తోందని అన్నారు.
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. మే 3 తేదీలోగా మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు మసీదుల వెలుపల స్పీకర్లను అమర్చి హనుమాన్ చాలీసా ప్లే చేస్తారని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్నిఆయన హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారాన్ని రేపాయి. దీనిపై మహావికాస్ అఘాడి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పలువురు నేతలు స్పందించారు. ఎన్సీపీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో సమస్యలే లేనట్టు ఈ లౌడ్ స్పీకర్ల సమస్యను ఎందుకు తెరమీదకు తెస్తున్నారని ప్రశ్నించారు. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగిస్తే ప్రజల నిరుద్యోగ సమస్య తీరుపోతుందా అని అడిగారు. ప్రజలకు ఆహారం లభిస్తుందా అని అన్నారు. కరోనా లాడ్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కొల్పోయారని, లౌడ్ స్పీకర్లు తొలగిస్తే వారికి ఉపాధి దొరుకుంతుందా అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారని, కానీ కొందరు మత విద్వేశాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
మరో సందర్భంలో ఎన్సీపీ చీఫ్ కూడా రాజ్ థాక్రేపై విమర్శలు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతోందని, కానీ దీనిపై ఎవరూ మాట్లాడరని, అనవసర విషయాలపై మాత్రం చర్చలు జరుపుతారని అన్నారు. ప్రస్తుతం దేశంలో అవి చాలా ముఖ్యమైన అంశాలని అన్నారు. అనవసరంగా మత విద్వేశాలు రెచ్చగొట్టకూడదని సూచించారు.
