చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దిమ్మ తిరిగే స్థాయిలో బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1,381 కిలోల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బంగారం పట్టుబడింది. 

బంగారాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని నిందితులు చెబుతున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, మెచ్చూరిటీ ముగియడంతో బంగారాన్ని తీసుకెళ్లాలని పీఎన్‌బీ అధికారులు టీటీడీకి సూచించారు. 

అయితే అంతలోనే పీఎన్‌బీ అధికారులు బంగారాన్ని తరలించారు. ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పీఎన్‌బీదేనని టీటీడీ స్పష్టం చేసింది.

రెండు వ్యాన్లలో బంగారం, కొంతమేర నగదును తరలిస్తూ పట్టుబడినవారిని అధికారులు విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాలతో సహా సీజ్‌ చేశారు.

కాగా అధికారులకు పట్టుబడిన బంగారాన్ని టీటీడీకి చెందినదిగా గుర్తించారు. తనిఖీల్లో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తమిళనాడుకు బయలుదేరారు.