వేయికి పైగా కొత్త కేసులు.. కోవిడ్-19 తో ఇద్దరు మృతి
New Delhi: దేశంలో కొత్తగా 1,249 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్-19 తో పోరాడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాలు 5,30,818కి పెరిగాయి. కొత్తగా కర్ణాటక, గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.
covid-19 update in india: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్తగా 1,249 కోవిడ్-19 కేసులతో పాటు ఇద్దరు కరోనావైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశంలో గత 24 గంటల్లో 1,249 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్-19 యాక్టివ్ కేసులు 7,927 కు పెరిగాయి. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం కర్ణాటక, గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,30,818 కు పెరిగింది.
రోజువారీ పాజిటివిటీ 1.19 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ 1.14 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసినప్పటి నుంచి నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,00,667)గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.02 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనావైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు సైతం క్రమంగా పెంచుతున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో 1,05,316 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు మొత్తం 92.07 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,61,922కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.