కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ వైరస్ కారణంగా లెక్కలేని మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రాణాలు కోల్పోయిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. గత ఏడాది మార్చి అనంతరం 59 దేశాల్లో 600మందికి పైగా జర్నలిస్టులు కరోనా కారణంగా మృతి చెందారు.

స్విట్లర్లాండ్ లోని అంతర్జాతీయ మీడియా వాచ్ డాగ్ ప్రెస్ ఏంబ్లమ్ క్యాంపెయిన్(పీఈసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2020 మార్చి 1 నుంచి ఆ ఏడాది చివరి వరకూ కరోనా కారణంగా 602 మంది జర్నలిస్టులు మృతి చెందగా.. లాటిన్ అమెరికాలో అత్యధికంగా 303 మంది మరణించారు.

దాని తరువాతి స్థానంలో ఉన్న ఆసియాలో 145 మంది కన్నుమూశారు. యూరప్‌లో 94 మంది, ఉత్తర అమెరికాలో 32 మంది, ఆఫ్రికాలో 28 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మృతిచెందారు. కాగా ఈ ఫోరం జర్నలిస్టుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలను ఆయా ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరింది. 

అలాగే మీడియాలో పనిచేసే వారికి ప్రాధాన్యతనిస్తూ వారికి ముందుగా టీకాలు వేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా పీఈసీ జనరల్ సెక్రటరీ బ్లిస్ లెంపెన్ మాట్లాడుతూ వృత్తిపరంగా జర్నలిస్టులు బయటి ప్రాంతాలకు వెళుతుంటారని అన్నారు. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు, ఫొటోగ్రాఫర్లు తప్పనిసరిగా బయట తిరగాల్సివుంటుందని, ఇలాంటివారిలో చాలామంది కరోనా బారిన పడుతున్నారని తెలిపారు.