Patna: బీహార్‌లోని సీతామర్హిలో 20 ఏళ్ల యువకుడిపై క్రూరమైన దాడి జ‌రిగింది. 100 కు పైగా కత్తిపోట్లతో పొదల్లో మృతదేహం ల‌భ్య‌మైంది. మృతుడి సోదరుడు పొరుగువారే హత్య చేసినట్లు ఆరోపించారు. 

Youth brutally murdered in Bihar's Sitamarhi: ఒక యువ‌కుడిని వంద‌సార్ల‌కు పైగా క‌త్తితో దాడి చేసి హ‌త్య చేశారు. డెడ్ బాడీని స్థానికంగా ఉన్న పొదల్లో పడేశారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. బీహార్ లో 20 ఏళ్ల యువకుడిపై కత్తితో వంద సార్లు దాడి చేశారు. అత‌ని ప్రాణాలు తీసిన త‌ర్వాత.. పొద‌ల్లో ప‌డేశారు. ఈ ఘట‌న సీతామ‌ర్హిలో చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే స్థానికులు పొదల్లో అతని మృతదేహం గురించి పోలీసులకు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడు రాష్ట్రంలోని సీతామర్హి నగరానికి చెందిన చింటూగా గుర్తించిన‌ట్టు తెలిపారు.

చింటూ శరీరం, ముఖంపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతుడు మంగళవారం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడనీ, అతని మృతదేహాన్ని స్థానికులు బుధవారం నాడు అక్క‌డి పొద‌ల ప్రాంతంలో కనుగొన్నారని పోలీసులు తెలిపారు. కాగా, చింటూ సోదరుడు తన పొరుగింటి వారే ఈ హ‌త్య చేశార‌ని ఆరోపించారు. త‌మ పోరుగున ఉండే రమా మహతో అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించాడు. హోలీ (మార్చి 8, 2023) రోజున చింటూ, మహతో వాగ్వాదానికి దిగార‌ని తెలిపారు.

చింటూకు నెల రోజుల క్రితం వివాహమైందని, స్క్రాప్ డీలర్ గా పనిచేసేవాడని మృతుడి సోదరుడు పోలీసులకు తెలిపాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా స్థానికుల ప్ర‌యాణాల‌ను ఆ వీధి గుండా నిషేధించారు. ఈ ప్రాంతానికి పలు మార్గాలను పరిమితం చేశామనీ, ట్రాఫిక్ ను దారి మళ్లించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

మృతుడి సోదరుడి వాంగ్మూలాన్ని నమోదు చేశామనీ, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.