Asianet News TeluguAsianet News Telugu

ముస్లింల కంటే రోడ్డు మీద ఉన్న శునకాలకే ఎక్కవ గౌరవం.. అసదుద్దీన్ ఒవైసీ

కేంద్రంలోని అధికార బీజేపీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ముస్లింల కంటే రోడ్డు మీద ఉన్న శునకాలకే ఎక్కవ గౌరవం అని అన్నారు.

more respect for the street dog than Muslims says AIMIM MP Asaduddin Owaisi
Author
First Published Oct 9, 2022, 12:46 PM IST

కేంద్రంలోని అధికార బీజేపీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ముస్లింల కంటే రోడ్డు మీద ఉన్న శునకాలకే ఎక్కవ గౌరవం అని అన్నారు.  దేశంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ముస్లింలు బహిరంగ జైల్లో బతుకుతున్నట్లే అనిపిస్తుందని చెప్పారు. ముస్లింలను బూచిగా చూపెట్టి ఆర్ఎస్‌ఎష్ విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దేశంలోని ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయని చెప్పారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలోనే అసదుద్దీన్ ఒవైసీ ఈ విధమైన కామెంట్స్ చేశారు.

కొద్ది రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉంధేలా గ్రామంలో యువకులపై దాడిని ప్రస్తావిస్తూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. “గుజరాత్‌లో నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని చెప్పడంతో పోలీసులు ముస్లిం పురుషులను పట్టుకున్నారు. 300 నుంచి 400 మంది ప్రజల ముందు ముస్లిం పురుషులను పోలీసులు స్తంభానికి కట్టి లాఠీలతో కొట్టారు. వారు నినాదాలు చేశారు. ముస్లిం పురుషులను కొట్టారు’’ అని ఒవైసీ అన్నారు. 

ఈ ఘటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ.. ‘‘ఇదేనా మన పరువు?. ప్రధానమంత్రి.. మీరు గుజరాత్‌కు చెందిన వారు.. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముస్లింలను స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టారు. ప్రజలు ఈలలు వేస్తారు. ఇదేనా మన గౌరవం.. ముస్లింకు సమాజంలో గౌరవం లేదా?.. ఇదేనా దేశ రాజ్యాంగం, లౌకికవాదం, చట్టబద్ధత?’’ అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

హైదరాబాద్ పెట్రోల్ బంక్‌లు బంద్ చేస్తున్నారని.. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తమ పండగలకు పెట్రోల్ బంక్‌లు బంద్ చేయిస్తున్నారని.. ఇతర పండగల సమయంలో ఎందుకు బంద్ చేయించరని  హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను అసదుద్దీన్ ప్రశ్నించారు. 

 


మరోవైపు.. దేశంలో జనాభా నియంత్రణ, మత అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. భగవత్ జీ..! జ‌నాభా పెరుగుద‌ల‌పై భయాందోళన చెందవద్దని, ముస్లిం జనాభా ఏమాత్రం పెరగడం లేదని, రోజురోజుకు త‌గ్గుతోంద‌ని సూచించారు. ఎందుకంటే చాలా మంది ముస్లింలు కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని.. ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం కూడా ముస్లింలలో అత్యధికమ‌నీ, ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు కూడా వేగంగా తగ్గుతోందని అన్నారు. గణాంకాలను ప‌రిశీలించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. 

భారతదేశంలో మతపరమైన అసమతుల్యత ఉందని, జనాభా పెరుగుద‌ల‌పై ఆలోచించాలని మోహన్ భగవత్ అంటున్నారనీ.. కానీ ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) రెండు శాతమేన‌నీ, దేశంలో క్ర‌మంగా ముస్లింల సంతానోత్పత్తి రేటు పడిపోయిందని అన్నారు.  2000 నుంచి 2019 వ‌ర‌కూ  హిందువుల్లో 90 లక్షల మంది ఆడ పిల్ల‌ల‌  భ్రూణహత్యలు జ‌రిగాయ‌ని..  అంత పెద్ద అంశంపై మోహన్ భగవత్ ఎందుకు మాట్లాడరని ప్ర‌శ్నించారు. కుమార్తెలను చంపడాన్ని ఖురాన్‌లో అతి పెద్ద నేరంగా అభివర్ణించారని ఒవైసీ అన్నారు. 

ఇక, టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరు మార్పును తప్పుబడుతూ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం టిప్పు ఎక్స్‌ప్రెస్‌ని వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. టిప్పు తన బ్రిటీష్ యజమానులకు వ్యతిరేకంగా 3 యుద్ధాలు చేసినందున బీజేపీ కోపం తెప్పించింది. మరో రైలుకు వడయార్‌ల పేరు పెట్టవచ్చు. టిప్పు వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయదు’’ అని అసదుద్దీన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios