మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు బలోపేతం అవుతాయని,వారం చివరిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, ఈ వారంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.
న్యూఢిల్లీ: ఈ వేసవి ఎండలు సెగలు కక్కాయి. ఉత్తరాదిలో వందకు పైగా మంది వడ దెబ్బలతో మృతి చెందారు. ఈ భానుడి భగభగల నుంచి సేద తీరడానికి వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు బలోపేతం అవుతాయని, ఈ వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మన దేశంలో వడ్లు, సోయాబిన్, పత్తి, చెరుకు పండించే దక్షిణ, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రుతుపవనాలు బలోపేతం అయ్యేలా కండీషన్లు ఉన్నాయని ఓ ఐఎండీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వారం చివరి నుంచి దక్షిణ, పశ్చిమ, ఉత్తరాదిలోనూ వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
భారత్‌లో రైతులు వర్షాధారిత పంటలు పండిస్తారు. మన దేశంలో రైతులకు కావాల్సిన 70 శాతం నీరు ఈ రుతుపవనాలే అందిస్తాయి. పంటకు నీరు అందించడమే కాదు.. రిజర్వాయర్లు, డ్యాముల్లో నీటిని నింపి వెళ్లుతాయి.
సాధారణంగా జూన్ 1వ తేదీకి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ భీకర వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత జూన్ మధ్యలో దాదాపు సగం దేశాన్ని ఈ రుతుపవనాలు కవర్ చేస్తాయి.
రుతుపవనాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి?
అయితే, ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. దీనికి కారణం బిపర్‌జోయ్ తీవ్ర తుఫాన్. అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ఏర్పడటంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు లక్షకు పైగా మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాల్లోని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఈ తుఫాన్ కారణంగా ఆస్తి నష్టం జరిగింది. ఈ తుఫాన్ కారణంగానే రుతుపవనాలు ఆలస్యంగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.
Also Read: ‘నా మీదికి ఆత్మ వస్తుంది, భయపడకుంటే నీ అప్పులు తీరిపోతాయి’.. మైనర్ బాలికపై రేప్.. ముగ్గురు అరెస్ట్
జూన్ నెలలో మన దేశం ఇప్పటి వరకు సాధారణం కంటే 33శాతం తక్కువే వర్షాపాతాన్ని నమోదు చేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ 95 శాతం వర్షాలే లేవు.
రుతుపవనాల రాక గురించి ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. ‘తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, ఈ వారంలోనే రుతుపవనాల వర్షాలు మంచిగా కురుస్తాయి’ అని అన్నారు. జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాపాతమే ఉన్నప్పటికీ జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తున్నది.
ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం కురిస్తాయని ఐఎండీ అంచనా కట్టడం గమనార్హం.
