అనుకున్న ప్రకారం  రుతుపవనాలు కేరళను తాకాయి. తిరువనంతపురంతో సహా కేరళలోని అనేక నగరాల్లో వర్షాలు కురవడం మొదలయింది. ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయని భారత వాతావరణ శాఖా ప్రకటించింది. 

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ కారణంగానే నిసర్గ తుఫాన్‌గా మారి, ఉత్తరం వైపుకు వెళ్లి, జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్‌ లలో భారీ వర్షాలను కురిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 

అరేబియా సముద్రంపై ఏర్పడ్డ అల్పపీడనం కారణంగానే ఋతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు, మాల్దీవులు, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ షాఖ తెలిపింది. 

శుక్రవారం రాత్రి ఆగ్రా నగరాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ఈ వర్షం సృష్టించిన బీభత్సానికి ముగ్గురు మృతి చెందారు కూడా. ఈ ఉరుముల వల్ల ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కూడా దెబ్బతినిందని భారత పురావస్తు శాఖ ప్రకటించింది. 

తాజ్ మహల్ కి పాలరాయితో ఉండే రైలింగ్, సింహద్వారం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. తాజ్ మహల్ వెనుక భాగంలో ఉండే పాలరాయి రైలింగ్ లో కొంతభాగం యమునా నది వైపుగా పడగా, ఇసుకరాయి ప్రహరీ కూడా కొంతభాగం దెబ్బతిన్నట్టు గా పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. 

ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుల వల్ల తాజ్ మహల్ గతంలో కూడా స్వల్పంగా దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 2018లో కూడా మే నెలలో రెండు సార్లు ఇలా పిడుగుపాటువల్ల స్వల్పంగా దెబ్బతినింది.  

ఇక శుక్రవారం రాత్రి ఆగ్రా నగరంపై విరుచుకుపడ్డ దుమారం దాదాపుగా 124 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. నగరమంతా కూడా చివురుటాకులా వణికింది. చెట్లు కూలాయి. ఇండ్లపైకప్పులు ఎగిరిపోయాయి.