లక్నో:  కోతుల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. మృతుడి కుటుంబసభ్యులు  కోతులపై  కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  భాగ్‌వత్‌లోని తిక్రీ గ్రామంలో కోతులు చెట్టుపైకి ఎక్కి ఇటుకలు విసరడంతో ధర్మాసింగ్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ధర్మాసింగ్  కట్టెపుల్లలను ఏరుకొనేందుకు వెళ్లాడు. అదే సమయంలో చెట్టు పక్కనే ఉన్న ఓ పాడుబడిన ఇంటి నుండి ఇటుక ముక్కలను తీసుకొని చెట్టుపైకి చేరుకొన్నాయి కొన్ని కోతులు.

కోతులను చూడకుండానే  చెట్టు కింద కట్టెలు ఏరుకొంటున్న  ధర్మాసింగ్‌పై కోతులు  ఇటుక ముక్కలను వేశాయి.  దీంతో ధర్మాసింగ్ తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు ఆయనను  ఆసుపత్రిలో చేర్చారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ధర్మాసింగ్ మృతి చెందాడు. కోతులు విసిరిన ఇటుకల దెబ్బలకే  ఆయన తీవ్రంగా  గాయపడ్డాడని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటుకల దెబ్బలతో ధర్మాసింగ్ ఛాతీ, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ధర్మాసింగ్ మృతికి కారణమైన  కోతులపై  కేసు నమోదు చేయాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేమని చెప్పేశారు.