నన్నే తరుముతావా? నీ అంతు చూస్తా..! అతనిపై రివేంజ్ తీసుకున్న కోతి.. 22 కిమీలు ప్రయాణించి మరీ..
నన్నే తరుముతావా? నీ అంతు చూస్తా.. నువ్వు ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కంకణం కట్టుకున్నన్నట్టుగానే ఆ కోతి తరిమిన వ్యక్తిపై పగబట్టింది. అటవీ శాఖ అధికారులను వదిలి మరీ ఆయనను టార్గెట్ చేసి దాడి చేసింది. ఎక్కడికెళ్లితే అక్కడికెళ్లి చుక్కలు చూపింది. అధికారులు కోతిని 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో వదిలిపెట్టినా వారం తిరిగేలోగా మళ్లీ అదే ఊరిలో ప్రత్యక్షమై దడా పుట్టించింది. కర్ణాటకలో జరిగిన ఈ కోతి రివేంజ్ స్టోరీపై చర్చ జరుగుతున్నది.
బెంగళూరు: కర్ణాటకలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ కోతి తనను తరిమిన వ్యక్తిని స్పష్టంగా గుర్తుపెట్టుకుని దాడి చేసింది. ఇంటా, బయటా ఎక్కడికెళ్లినా ఆయనను వెంటాడింది. ఆయన నడిపే ఆటోపై ఉండే కవర్‌ను చింపేసింది. ఆయనపై పడి రక్కింది. కన్ను మూసినా తెరిచినా కోతి పీడకలలా వెంటాడింది. ఎట్టకేలకు అధికారులు ఆ కోతిని కనీసం 22 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టి వచ్చారు. కానీ, ఆ కోతి తన పగను మరువలేదు. అంత దూరం ప్రయాణించి మరీ ఆ వ్యక్తి ఉన్న ప్రాంతానికి వచ్చింది. ఈ కోతి రివేంజ్ స్టోరీని ఓ సారి చూద్దాం..
చిక్‌మగళూర్ జిల్లాలోని కొట్టిగెహారా గ్రామస్థులకు ఓ వానరం చుక్కలు చూపించింది. మార్కెట్‌ల నుంచి పండ్లు ఎత్తుకెళ్లడం, దుకాణం నుంచి సరుకులు ఎత్తుకెళ్లడం, మరెన్నో చోట్లా స్థానికుల జరుగుబాటును చిందరవందర చేసింది. స్కూల్ వద్దకూ చేరి పిల్లలను భయభ్రాంతులకు గురి చేసింది. పిల్లలు భీతిల్లారు. దీంతో కొందరు స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్థానికుల సహాయంతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడే జగదీశ్ అనే వ్యక్తి దాని బారినపడ్డాడు.
ఆటో నడుపుకునే జగదీశ్ ఈ నెల 16న అటవీ శాఖ అధికారులకు సహాయపడ్డాడు. కోతిని వారికంటే కొంచెం ఎక్కువే తరిమాడు. దీంతో కోతి కూడా అధికారులను వదిలి జగదీశ్‌ను టార్గెట్ చేసింది. ఆయనపై దూకింది. దీంతో హడలిపోయిన జగదీశ్ తన ఆటోలో నక్కాడు. ఆ ఆటోపైనా కోతి దూకి టాప్ చింపేసింది. ఆయన వెంటే పరిగెత్తి బీభత్సం సృష్టించింది. ఎట్టకేలకు మూడు గంటలు ప్రయత్నించి 30 మంది వ్యక్తుల బృందం దాన్ని బంధించగలిగారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో బేలూరు అడవిలో దాన్ని వదిలిపెట్టారు. దీంతో కోతి అరాచకం ముగిసిందని అందరూ చల్లబడ్డారు. కానీ, వారం తర్వాత మళ్లీ ఊరిలో అది ప్రత్యక్షం కావడంతో ముఖ్యంగా జగదీశ్‌కు ఊపిరిపోయినంత పనైంది.
అప్పటికే దాని గాయాలకు చికిత్స తీసుకుంటే నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆటో నడపటానికి బయటికెళ్లడం లేదు. దీంతో మరోసారి అది గ్రామంలోకి వచ్చిందని తెలియడంతో ఏం చేయాలో అతనికి తోచలేదు. మళ్లీ అటవీ అధికారులనే సహాయం కోసం ఆశ్రయించాడు. ఈ సారీ ఎంతో ప్రయాస పడి కోతి పట్టుకుని మరింత దూరంలోని అడవిలో వదిలిపెట్టారు. ఇకనైనా జగదీశ్ ప్రశాంతంగా కాలం గడపవచ్చునా? కోతి పీడ విరగడైనట్టేనా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.