రాజస్తాన్‌లో ఓ కేసులో విచారణ సంచలనంగా మారింది. జైపూర్‌లోని జిల్లా న్యాయస్థానం ఓ మర్డర్ కేసు విచారిస్తూ ఎవిడెన్స్‌ను సమర్పించాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, మర్డర్ కేసులోని ఎవిడెన్స్‌ను కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం చెప్పారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. 

జైపూర్: కోర్టులో ఒక్కోసారి విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వాదనలూ మరీ వింతగా కనిపిస్తుంటాయి. న్యాయవాదులు తమ క్లయింట్లను గెలిపించుకోవడానికి అనేక విధాలుగా ఆపసోపాలు పడుతుంటారు. అందుకోసం కొత్త కొత్త కోణాల్లో వాదనలు చేస్తుంటారు. కానీ, ఓ కేసులో రాజస్తాన్ పోలీసులు చేసిన వాదనలు మరీ వింతగా ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో ఆధారాలు సమర్పించాలని కోర్టు అడిగితే.. ఎవిడెన్స్‌ను కోతి ఎత్తుకు పోయిందని సమాధానం చెప్పి అందరినీ దిగ్భ్రాంతిలో ముంచారు. ఈ ఎవిడెన్స్‌లలో మారణాయుధం కత్తి కూడా ఉండటం గమనార్హం.

రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో చంద్వాజీ ఏరియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శశికాంత్ శర్మ హత్య జరిగింది. 2016లో ఈ హత్య జరిగింది. ఆయన మూడు రోజులుగా కనిపించట్లేదనే కేసు కింద దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఆయన డెడ్ బాడీ కనిపించింది. శశికాంత్ శర్మను హత్య చేశారని ఆయన కుటుంబం ఆరోపణలు చేసింది. శశికాంత్ శర్మ డెడ్ బాడీ లభించిన తర్వాత కూడా తమ డిమాండ్లతో ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బంధం చేశారు.

ఈ నిరసనల తర్వాత పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రాహుల్, మోహన్ లాల్ కందేరాలను ఐదు రోజుల తర్వాత అరెస్టు చేశారు. వారిద్దరూ చంద్వాజీ నివాసులు. వారిద్దరినీ జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. అప్పుడు దర్యాప్తులో ఆడిటరీలో స్పేస్‌ లేనందున మర్డర్ వెపన్ సహా ఇతర ఎవిడెన్స్‌లను ఒక బ్యాగ్‌లో ఉంచి వాటిని పోలీసు స్టేషన్‌లోని ఓ చెట్టు కింద ఉంచారు.

ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణ అనేక దశలు చూసింది. ఓ సారి కోర్టు మర్డర్ కేసులోని ఆధారాలను సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీనికి సమాధానంగా వారు ఆ ఎవిడెన్స్ బ్యాగ్‌ను కోతులు ఎత్తుకెళ్లాయని కోర్టుకు తెలిపారు. ఆ బ్యాగ్‌లో ఈ కేసుకు సంబంధించి కత్తి సహా 15 ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయి.

పోలీసులు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను కోతి ఎత్తుకెళ్లిందని వివరించారు. దీంతో కోర్టు సీరియస్ అయింది. పోలీసులకు నోటీసులు పంపింది. ఆ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను ఇందుకు బాధ్యులుగా చేసి నిందించారు. ఆ కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం కానిస్టేబుల్ రిటైర్ అయ్యాడు. మరణించాడని తెలిసింది.