Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్‌లో స్కూల్‌కు హాజరైన కోతి.. విద్యార్థులతోపాటు పాఠాలు విన్న వానరం.. వీడియో వైరల్

జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి ఓ వానరం వచ్చింది. తరగతి గదిలో విద్యార్థుల సరసన కూర్చుంది. పాఠాలు విన్నది. ఉపాధ్యాయుడు కూడా క్లాసు కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

monkey attending class in jharkhands govt school in a viral video
Author
First Published Sep 17, 2022, 4:37 PM IST

రాంచీ: జంతువులు తరుచూ మనుషులను అనుకరించడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కోతులు మరీ దగ్గరగా అనుకరిస్తుంటాయి. ఒక్కోసారి మనల్నే ఆశ్చర్యపరుస్తాయి. మనిషి చేసే పనులను అదే రీతిలో అవి కూడా సులువుగా చేసేస్తుంటాయి. ఇటీవలే ఓ వీడియోలో కోతి కూడా తన జీవితంలో మొబైల్ ఫోన్ అంతర్భాగమైనట్టుగా ప్రవర్తించాయి. ఇప్పుడు మరో వీడియోలో ఏకంగా స్కూల్‌లో క్లాసులకు హాజరైన ఓ కోతి ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషనల్‌గా మారింది.

జార్ఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోకి ఓ వానరం వెళ్లింది. అక్కడ క్లాసు రూమ్‌లో విద్యార్థుల సరసన కూర్చుని శ్రద్ధగా పాఠాలు విన్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ యూజర్ దీపక్ మహతో గురువారం పోస్టు చేశాడు. ఈ పోస్టుకు స్వల్పకాలంలో వ్యూలు, లైక్‌లు పెద్ద సంఖ్యలో వచ్చాయి. 

జార్ఖండ్‌లోని హజరీబాగ్ స్కూల్‌లో ఓ కోతి క్లాసులకు హాజరైందని, విద్యార్థులతో పాటుగా పాఠాలు విన్నదని ఆ వీడియోను పోస్టు చేసి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఆ కోతి క్లాసులో వెనుక వైపు కూర్చుని ఉండగా.. తొలుత విద్యార్థులు ఆ కోతి వైపు చూశారు. ఆ తర్వాత వారు మళ్లీ బ్లాక్ బోర్డు వైపు తిరిగారు. ఉపాధ్యాయుడు కూడా పాఠం బోధించడం కొనసాగించాడు.

ఈ వీడియోతోపాటు మరో ఫొటో కూడా వైరల్ అయింది. ఆ ఫొటోలో వానరం ఏకంగా డెస్క్ మీద కూర్చుని ఫొటోకు పోజు ఇచ్చింది. స్కూల్‌లో కొత్త స్టూడెంట్ అనే క్యాప్షన్ ఈ ఫొటోకు ఆయన యాడ్ చేశాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు చోటుచేసుకున్నదనే విషయంపై స్పష్టత లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios