Asianet News TeluguAsianet News Telugu

మనీలాండరింగ్ కేసు: ఛత్తీస్‌గఢ్ లో ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నాయ‌కుల కార్యాల‌యాల్లో ఈడీ దాడులు

Enforcement Directorate raids: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్ గఢ్ లోని ప‌లు ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించింది. ఐఏఎస్ అధికారి రాణు సాహు, మరికొందరు అధికారులు, ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేత, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, రాయ్ పూర్ తదితర నగరాల్లోని కాంట్రాక్టర్లు, హవాలా డీలర్లకు సంబంధించిన 15కు పైగా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 

Money laundering case: ED conducts searches at offices of IAS officers, Congress leaders in Chhattisgarh RMA
Author
First Published Jul 22, 2023, 12:32 AM IST

money laundering case: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్ గఢ్ లోని ప‌లు ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించింది. ఐఏఎస్ అధికారి రాణు సాహు, మరికొందరు అధికారులు, ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేత, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, రాయ్ పూర్ తదితర నగరాల్లోని కాంట్రాక్టర్లు, హవాలా డీలర్లకు సంబంధించిన 15కు పైగా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

వివ‌రాల్లోకెళ్తే.. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఛత్తీస్ గఢ్ లో కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు, హవాలా ఆపరేటర్లకు చెందిన నివాసాలు, కార్యాల‌యాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్‌లు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, కాంట్రాక్టర్లు, రాయ్‌పూర్ తదితర నగరాల్లో హవాలా డీలర్లకు సంబంధించిన 15కి పైగా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. గతంలో రాయ్ గఢ్ కలెక్టర్ గా పనిచేసిన సాహు ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ గతంలో వారిపై దాడులు చేసి ఆస్తులను జప్తు చేసింది.

రాష్ట్ర రాజధానిలోని సాహు, అగర్వాల్, కోర్బాలోని కోర్బా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రభాకర్ పాండే నివాసాల వెలుపల కేంద్ర పారామిలటరీ సిబ్బందిని మోహ‌రించిన‌ దృశ్యాలు చూపించాయ‌ని ఇండియా టూడే నివేదించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల కింద ఫెడరల్ ఏజెన్సీ కొత్తగా కేసు నమోదు చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు ఏ కేసులో జరుగుతున్నాయో తెలియనప్పటికీ, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణంతో దీనికి సంబంధం ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో బొగ్గు, మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు, వారితో సంబంధమున్న వారిని అరెస్టు చేసింది.

కాగా, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గతంలో రెండు మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ చర్యల‌ను తప్పుబట్టారు. సంబంధిత అన్ని చర్యలు రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకుల సూచనల మేరకు  ఛ‌త్తీస్ గ‌డ్ లో సోదాలు  జరుగుతున్నాయని అన్నారు. అయితే, వివిధ ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. అందుకే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ర్య‌లు ప్రారంభించాయ‌ని పేర్కొంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. మరోవైపు అధికార పార్టీ రాష్ట్ర సంక్షేమ పథకాలను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios