ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన మాంసం ఎగుమతిదారుడు మొయిన్‌ ఖురేషీ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఖురేషీకీ సన్నిహితుడు అయిన హైదరాబాద్‌కు చెదిన సాన సతీష్‌ బాబును అదుపులోకి తీసుకున్నారు.  

ఖురేషీ అక్రమాస్తుల కేసులో సాన సతీశ్‌ బాబు సాక్షిగా ఉన్నాడు. అయితే విచారణకు సహకరించకుండా తప్పించుకుతిరుగుతున్నారు సతీష్ బాబు. అయితే శుక్రవారం అర్ధరాత్రి   ఢిల్లీలోని ఓ కీలక ప్రదేశంలో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం సతీష్ బాబును అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. సెంట్రల్‌ ఢిల్లీలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సతీశ్‌ను శుక్రవారం రాత్రి నుంచి ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పటియాలా కోర్టులో సతీష్ బాబును ఈడీ అధికారులు హాజరు పరచనున్నట్లు సమాచారం. 

ఇకపోతే మెయిన్ ఖురేషీ అక్రమాస్తుల కేసులో సతీష్ ప్రమేయం ఉందని ఈడీ గుర్తించింది. దీంతో ఆయనను ఈడీ, సీబీఐ అధికారులు విచారించారు కూడా. కేసు విచారణలో ఉండగా సతీష్ బాబు ఒక బాంబు పేల్చారు. 

కేసు నుంచి తనను తప్పించాలంటూ పలువురు అధికారులు, అనధికారులకు ముడుపులు ఇచ్చినట్లు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ప్రభావితం చేసేందుకు ఆయన అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పినట్లు తెలిపారు.  

ముడుపులు ఇచ్చినప్పటికీ తనని వేధిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంలోని కీలక విభాగాల అధిపతులకు ఆయన లేఖలు రాశారు. తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లు సతీశ్‌ బాబు ఫిర్యాదుతో సీబీఐలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. 

కేంద్ర ప్రభుత్వంలోని కీలక విభాగాల అధిపతులకు లేఖలు రాసిన అనంతరం సాన సతీష్ బాబు విచారణకు గైర్హాజరవుతున్నారు. కొద్ది రోజుల నుంచి సతీష్ బాబు కనిపించకుండా పోవడంతో ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం రాత్రి ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. 

ఇకపోతే మొయిన్ ఖురేషి కేసులో తనను విచారణ నుంచి తప్పించాల్సిందిగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు సతీష్ చేసిన ఆరోపణలు వారి పదవులకు ఎసరు తెచ్చే వరకు వెళ్లింది. అంతేకాదు కీలక సంస్థ అయిన సీబీఐలో అంతర్గత కుమ్ములాటలకు కారణమయ్యాయి.  

సతీష్ బాబు ఫిర్యాదు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, డిప్యూటీ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థాన తమ పదవులకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అలోక్‌ వర్మ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయగా రాకేశ్ అస్థానాను పౌర విమానయాన శాఖ బ్యూరోకు బదిలీ చేసింది కేంద్రం. అంతేకాదు అనేక మందిపై బదిలీ వేటు వేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ ను టాప్ చేయడంతో ఈ వివాదంలో ఇరుక్కోవాల్సి వచ్చింది.