ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు .  పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న డేట్లు ఫిక్సయ్యాయని చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్‌ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోడీ పూర్తి స్పష్టతతో వున్నారని.. ఈ మేరకు తేదీలు ఖరారయ్యాయని ఆయన తెలిపారు.

రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లుగానే పాకిస్థాన్‌, చైనాలతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో మోడీ నిర్ణయించారని స్వతంత్రదేవ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నట్లు అదే వీడియోలో స్వతంత్రదేవ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడారు.  భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వార్తల్లోకెక్కారు.

మరోవైపు ఇవాళ సిక్కింలో పర్యటించి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, శాంతిని స్థాపించాలని భారత్‌ కోరుకుంటోందని చెప్పారు.

అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే యూపీ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.