దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. దేశ ఆర్ధిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. జీడీపీ 6 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. మార్కెట్లు మందగమనంలో ఉండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అసలే నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠంలో నిరుద్యోగం తాండవిస్తోంటే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ ఆర్ధిక మందగమనం వల్ల మరింతమంది నిరుద్యోగులుగా మారుతున్నారు. 

ఎలాగైనా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కృషిచేస్తున్న సర్కార్ మొదటగా తనవైపునుండి నరుక్కురావడం గురించి ఆలోచిస్తుంది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పెద్ద షాక్ అని చెప్పొచ్చు. 

33 సంవత్సరాలకు మించి ఏ కేంద్రప్రభుత్వోద్యోగి కూడా సర్వీస్ చేయడానికి వీలుండదు. ఆలా అని రిటైర్మెంట్ వయసును తగ్గించరు. రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుగానే ఉంటుంది. కాకపోతే 60 సంవత్సరాలకు ముందే కనుక 33 సంవత్సరాల సర్వీస్ ముగిస్తే ఆ సదరు ఉద్యోగి పదవీవిరమణ పొందాల్సిందే. 

ఉదాహరణకు ఒక వ్యక్తి 27 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరితే అతని 33 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యేసరకు అతనికి 60 సంవత్సరాల వయసు కూడా వస్తుంది. సర్వీస్ పూర్తవుతుంది, రిటైర్మెంట్ వయసు కూడా కాబట్టి రిటైర్ అవుతాడు. ఎవరన్నా 27 సంవత్సరాలకు ముందే ఉద్యోగంలో చేరితే మాత్రం 60 సంవత్సరాలకు ముందే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి గనుక 17 సంవత్సరాలకే ఉద్యోగంలో చేరితే అతను 50 యేండ్లకే రిటైర్ అవుతాడన్నమాట. 

ఈ నిర్ణయం అన్ని క్యాడర్లలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వర్తింపచేసే ఆలోచనల్లో ఉంది కేంద్ర సర్కార్. ఆర్మీ లో కూడా ఈ నిబంధనను అమలుచేయాలనే యోచనలో ఉంది. ఇలా చేయటం వల్ల ఉద్యోగులు రిటైర్ అవ్వగానే నూతన ఉద్యోగార్థులకు  అవకాశం లభిస్తుంది. తద్వారా నిరుద్యోగ సమస్యను కొంతలో కొంత తగ్గించవచ్చనే యోచనలో ఉంది సర్కార్. 

ప్రైవేట్ రంగంలో కొలువులు పెరగాలంటే, ఆర్ధిక వృద్ధి గణనీయంగా పెరగాలిసుంటుంది. అంతర్జాతీయంగా, అమెరికా,చైనాల వాణిజ్య యుద్ధం వల్ల కేవలం భారత మార్కెట్లే కాకుండా అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో నెలకొని ఉన్న యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ రంగం ఇప్పటికిప్పుడు పుంజుకునే విధంగా కనపడడంలేదు. 

రూపాయి విలువ నానాటికీ క్షీణీస్తోంది. స్టాక్ మార్కెట్లు కూడా పడిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వరంగంలోనన్నా ఉపాధిని అవకాశాలను ఉద్యోగార్థులకు పెంచాలని చూస్తుంది మోడీ ప్రభుత్వం . 

ఆలోచన బాగానే ఉంది. కాకపోతే, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం. రాష్ట్రప్రభుత్వాలేమో మరోపక్క ఉద్యోగుల పదవీవిరమణ వయసును ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఇబ్బడిముబ్బడిగా పెంచేసాయి. పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ఉద్యోగాలకు పదవీవిరమణ వయసు ఏకంగా 65 సంవత్సరాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఇప్పటికే ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచనున్నట్టు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చే ఎన్నికల నాటికి పదవీ విరమణ వయసును పెంచవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ఇలా ఒక పక్కనేమో కేంద్రం తాగించాలని చూస్తుంటే, రాష్ట్రప్రభుత్వాలు రిటైర్మెంట్ వయసును పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం పరిగణిస్తున్న ఈ ఆలోచన ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.