న్యూఢిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు కీలకమైన బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించేలా చూసుకుంటున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో సంచలనానికి శ్రీకారం చుట్టిన మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 

మతమార్పిడులను నిషేధిస్తూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ బిల్లు రూపకల్పనకు ఇప్పటికే మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దానిపై చర్చలు సాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎటువంటి మతమార్పిడులనైనా నిరోధించే విధంగా ఆ బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్  ను నిషేధిస్తూ బిల్లును ఆమోదింపజేసుకుంది. అదే విధంగా కాశ్మీర్ కు స్వయంప్రత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదింపజేసుకుంది. 

ఈసారి జరిగిన బడ్జెట్ సమావేశాలు అత్యంత చారిత్రకమైనవని, ఫలవంతమైనవని లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు ప్రశంసించారు.