పేదలకు ప్రతినెలా కనీస ఆదాయం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. నేడు( ఫిబ్రవరి1వ తేదీ) పార్లమెంట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.  కాగా.. ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిపించే అవాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పేదల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

2016-17 ఆర్థిక సర్వేలోనే ప్రభుత్వం సార్వత్రిక ప్రాథమిక ఆదాయం(యూబీఐ) గురించి ప్రస్తావన చేసింది. అన్ని రాయితీలను కలిపి నగదు రూపంలో పేదలకు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఈ ఆలోచన ఆచరణలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆ ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతానికి ఆ విధానంలో కాకుండా పాక్షిక సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

దీనిని దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న అందరికీ కాకుండా నిరుపేదలుగా తేలిన 40శాతం(12కోట్లు) మందికి వర్తించే అవకాశం ఉంది. వారికి నెలకు రూ.700 నుంచి రూ.1200 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వానికి రూ.1లక్ష కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.