35 మంది అభ్యర్థులు పోటీపడ్డ శ్రీలంక అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన వోటింగ్ నిన్న జరగ్గా, నేటి ఉదయం నుండి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఈ ఎన్నికల్లో  గోటబయ రాజపక్స విజయం సాధించిన విషయం తెలిసిందే. 

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ రాజపక్సకు భారత ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇందుకు సంబంధించి నేడు ఆదివారం నాడు ఓ ట్వీట్ చేశారు. 'అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ రాజపక్సకు నా అభినందనలు. ఇరు దేశాల మధ్య, దేశ పౌరుల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత ధృడంగా చేసేందుకు, ఇరు ప్రాంతాల భద్రత, శాంతి, సంవృద్ధి  కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను' అని మోడి ఆ ట్వీట్‌లో తెలియపరిచారు.  ఎన్నికలను విజయవంతం చేసిన ప్రజలకు కూడా మరొక ట్వీట్లో మోడి అభినందనలు తెలిపారు. 

Also read: శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స విజయం

ఆదివారం ఉదయం 11 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87 శాతం ఓట్లు పొలవగా, సమీప ప్రత్యర్థి మంత్రి సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో లెఫ్ట్ అభ్యర్థి అనుర కుమార దిస్సానాయకే కు 4.69 శాతం ఓట్లు పోలయినట్టు శ్రీలంక ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ప్రకటించింది

శ్రీలంక పోడుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) అభ్యర్థిగా ఎన్నికల్లోకి దిగిన 70 ఏళ్ల రాజపక్సే  దేశానికి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద్ర రాజపక్సే సోదరుడు. రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా  ఆయన,  2008-2009లో తమిళ వేర్పాటువాదులతో (ఎల్టీటీఈ)  పోరులో తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి అనేక యుద్ధ నేరాలకు ఒడిగట్టారని అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు.  

వాస్తవానికి ఆయనకు ఆయన పౌరసత్వం ఒకింత ఇబ్బందిగా మారింది. విదేశీ పౌరసత్వం ఉన్నవారిని,  శ్రీలంకయేతరులను ఎన్నికలలో పోటీ చేయడానికి అక్కడి శ్రీలంక చట్టాలు అనుమతించవు. దానితో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదలుకున్నారు. 

ఈ సారి బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక భారతీయ తమిళుడు ఎన్నికలలో పాల్గొన్నాడు. భారతీయ తమిళుడు పోటీ చేయడం ఇదే మొదటిసారి.  20 సంవత్సరాలలో మొదటిసారిగా ఒక మహిళ బరిలోకి దిగారు. మొత్తంగా రేసులో ముగ్గురు ముస్లిం అభ్యర్థులు, ఒక మాజీ నటుడు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు, మాజీ ఆర్మీ కమాండర్ ఉన్నారు.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ నుండి మద్దతు సంపాదించలేకపోవడంతో, తిరిగి ఎన్నికల బరిలో నిలవలేదు. బదులుగా, రైట్ వింగ్ సిద్ధాంతాలు కలిగిన శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) అభ్యర్థి గోటబయ రాజపక్సే కు మద్దతు ప్రకటించారు. గోటబయ గెలిచాడు కాబట్టి, మహీంద ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికం.