బెంగుళూరు:చట్టం ఎవరికైనా ఒకే రకంగా వర్తించాల్సిందేనని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (కాగ్) అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారనే కారణంగా ఐఎఎస్ అధికారి మొహిసిన్‌ సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే.  

ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్‌లో జనరల్ అబ్జర్వర్‌గా విధులు నిర్వహిస్తున్న మొహిసిన్ ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. ఎస్పీజీ అనుమతితోనే దూరం నుండి హెలికాప్టర్ వీడియోను తీసుకోవాల్సిందిగా వీడియో గ్రాఫర్ కు సూచించి వెళ్లిపోయాడు. 

అయితే తమ రక్షణలో ఉన్న ప్రధానికి ఇలాంటి తనిఖీల నుండి మినహాయింపు ఉంటుందని ఎస్పీజీ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  సబార్డినేట్ రూల్స్‌ను అతిక్రమించారని మొహిసిన్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు. 

తనపై సస్పెన్షన్‌ను విధించడాన్ని సవాల్ చేస్తూ మొహిసిన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ‌ను ఆశ్రయించారు. ఎస్పీజీ భద్రత ఉన్న వారి భద్రత గురించి ఆలోచించాల్సిందేనని కాగ్ అభిప్రాయపడింది. అయితే అంత మాత్రానా తమ ఇష్టానుసారంగా నడుచుకొనే అధికారం ఈ రక్షణలో ఉన్నవారికి ఉందని భావించరాదన్నారు. అయితే చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుందని కాగ్ అభిప్రాయపడింది. అదే సమంయలో మొహిసిన్‌పై విధించిన సస్పెన్షన్‌పై స్టే విధించింది.

మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన హెలికాప్టర్‌ నుంచి ఓ నల్ల ట్రంకు పెట్టెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మెహిసిన్‌ ప్రధాని హెలికాప్టర్‌ను ఒడిశాలో తనిఖీ చేయాల్సి వచ్చిందంటూ మెహిసిన్‌ న్యాయవాది చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్, మరి ఆ ట్రంకు పెట్టె విషయంలో ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎన్నికల కమిషన్‌ వర్గాలను ప్రశ్నించింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి వాహనాలను అనేక సార్లు తనిఖీ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి వాహనాలను తనిఖీ చేశారు. మరి వారి వాహనాలను తనిఖీ చేసిన అధికారులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని కాగ్ ప్రశ్నించింది. మరో వైపు ఈ కేసు విచారణను జూన్ మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు.