కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవ్వడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. రాష్ట్రపతితో ఆయన గంటన్నర సేపు చర్చలు జరిపిన ప్రధాని మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లుగా సమాచారం.

కాగా దేశంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మరో రెండు, మూడు నెలల పరిస్థితిపై అంచనాలు, చైనా-భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, తన లఢఖ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని.. రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది.

కాగా కేంద్ర కేబినెట్ ఏర్పరిచి 13 నెలలు గడిచిన నేపథ్యంలో పలువురి పనితీరుపై సమీక్ష జరిపి కొందరిని తొలగించడం, మరికొందరి శాఖలు మార్చడం వంటి అంశాలను ప్రధాని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారడానికి, కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసి.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన జ్యోతిరాదిత్య సింధియాను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైనట్లుగా బీజేపీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి తెరపడాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.