వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుని సంచనల నిర్ణయాలతో దూసుకెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యథికకాలం పనిచేసిన ఘనతను అందుకున్నారు.

కాంగ్రెసేతర నేతల్లో వాజ్‌పేయ్ పలుమార్లు ప్రధానిగా 2,268 రోజులు వ్యవహరించగా మోడీ ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేశారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత అత్యథిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను మోడీ సొంతం చేసుకున్నారు.

2014 మే 26న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీ, 2019 మే 30న రెండోసారి బాధ్యతలు చేపట్టారు. కాగా భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు అత్యున్నత పదవిని చేపట్టి అత్యదిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు సాధించారు.

ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం చేశారు. ఆపై మన్మోహన్ సింగ్ వరుసగా ఐదేళ్లపాటు రెండుసార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు.

ఇప్పుడు నరేంద్రమోడీ సైతం దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా చరిత్ర సృష్టించనున్నారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీ కాలం పూర్తయిన వెంటనే తిరిగి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది మన్మోహన్, మోడీలు కావడం గమనార్హం.