వయానాడ్‌లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు! మాక్ పోలింగ్‌తో అన్ని కళ్లు అటువైపే.. బరిలోకి ప్రియాంక గాంధీ?
కేరళలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానం వయానాడ్‌కు త్వరలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎలాంటి షెడ్యూల్ విడుదల కానప్పటికీ అక్కడ తొలి దశ సన్నద్ధతలో భాగంగా మాక్ పోల్ నిర్వహించారు.
న్యూఢిల్లీ: కేరళలోని వయానాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సారథ్యం వహించారు. అయితే, మోడీ ఇంటి పేరు కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్దారించిన తదనంతరం ఆయన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేశారు. దీంతో అప్పటి నుంచి వయానాడ్ సీటు ఖాళీగానే ఉన్నది. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ గుజరాత్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఇదంతా ఒక వైపు ఉండగా.. తాజాగా, వయానాడ్ లోక్‌సభ పరిధిలోని కోజికోడ్ జిల్లాలో మాక్ పోల్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. వయానాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక కసరత్తులో భాగంగా ఈ మాక్ పోల్ నిర్వహిస్తున్నారని తెలిసింది. అయితే, ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఇంకా విడుదల కానేలేదు.
కోజికోడ్ జిల్లా కలెక్టర్ బుధవారం మాక్ పోల్ నిర్వహించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలకు ఒక కమ్యూనికేషన్ పంపించారు. వయానాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికకు తయారీలో భాగంగా తొలి దశ పరీక్షలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పరిశీలించడానికి మాక్ పోల్ నిర్వహిస్తున్నట్టు ఆ కమ్యూనికేషన్‌లో పేర్కొన్నారు.
అయితే, అధికారులు మాత్రం ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. త్వరలో వయానాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా? లేదా? అనే విషయం తమ అవగాహనలో లేదని వివరించారు. తిరువంబడి అసెంబ్లీ సెగ్మెంట్ వయానాడ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కోజికోడ్ జిల్లా కిందికే వస్తుంది. అందుకే ఈ జిల్లాలో మాక్ పోల్ నిర్వహించారు.
సాధారణంగా ఒక సీటు ఖాళీ అయినప్పుడు.. ఆరు నెల్లలోపే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. మళ్లీ ఎన్నికలు ఏడాది లోపు జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించే నిర్ణయం ఎన్నికల సంఘం విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
Also Read: రూ. 2000 నోట్లు ఎన్ని వెనక్కి వచ్చాయంటే.. RBI గవర్నర్ చెప్పిన విషయాలివే
ఇదిలా ఉండగా వయానాడ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ కూడా నడుస్తుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా వయానాడ్ పై ఫోకస్ పెంచింది. కేంద్ర మంత్రులు, టాప్ లీడర్లు తరుచూగా ఈ నియోజకవర్గానికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఈ జిల్లాలో ఎక్కువగా హైలైట్ చేస్తుండటం గమనార్హం.
2019లో రాహుల్ గాంధీ ఇక్కడ 4.3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.