పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్‌లే కనిపిస్తున్నాయి. చాలా మంది మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. 

జామ్‌నగర్: పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్‌లే కనిపిస్తున్నాయి. చాలా మంది మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. ఎక్కువ సమయం అందులోనే గడుపుతున్నారు. ఇది పిల్లలో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వాడొద్దంటే కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌లో మొబైల్ ఫోన్ అడిక్షన్ ఓ మైనర్ బాలిక ప్రాణాలు తీసుకునేలా చేసింది. మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నందుకు తల్లి మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాలికను 13 ఏళ్ల జెనీషా అభంగిగా గుర్తించారు. ఈ ఘటన జామ్‌నగర్‌లోని ధ్రోల్ తాలూకాలోని పిపర్తోడ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలు.. జెనీషా కుటుంబం సూరత్‌లో నివాసం ఉంటుంది. జేనీషా 7వ తరగతి పరీక్షల తర్వాత.. తల్లిదండ్రులతో కలిసి వేసవి సెలవుల కోసం జామ్‌నగర్‌లోని ఆమె మేనమామ ఇంటికి వచ్చారు. అయితే జేనీషా, ఆమె సోదరుడు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లో గడుపుతున్నందుకు ఆమె తల్లి ఉర్మిళ వారిని తిట్టారు. దీంతో మనస్తాపం చెందిన జేనీషా ఒక గదిలో వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. 

అయితే జేనీషా బయట ఆడుకుంటుందని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. అయితే ఎంతసేపటికి జాడ తెలియకపోవడంతో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తలుపు వేసి ఉన్న గది తెరవగా.. అక్కడ జేనీషా ఆత్మహత్య చేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ‘‘మేము కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసాము. బాలిక రోజంతా తన మొబైల్‌లో గడిపింది. బాలిక తల్లిదండ్రులు, మామ ఆమెను మందలించారు’’ అని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా వెల్లడించారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)