రామనవమి సందర్భంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న శివసేన పార్టీ కార్యాలయం ఎదుట మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులకు హనుమాన్ చాలీసా ప్లే చేశారు. అయితే దీనిని పోలీసులు అడ్డుకున్నారు.
ముంబైలోని శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) నాయకులు ఓ ట్యాక్సీలో లౌడ్ స్పీకర్లు అమర్చి హనుమాన్ చాలీసా వినిపించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హనుమాన్ చాలీసాను నిలిపివేసి, ఎంఎన్‌ఎస్ నాయకుడు యశ్వంత్ కిల్లెదార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రామ నవమి సందర్భంగా మహారాష్ట్ర రాజధానిలోని శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం బయట లౌడ్ స్పీకర్‌లో హనుమాన్ చాలీసా ప్లే చేయాలని MNS గతంలో ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు నేడు ఈ చర్యకు పూనుకున్నారు.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే గత వారం ముంబైలో గుడి పడ్వా ర్యాలీ సందర్భంగా ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. మసీదుల్లో వినియోగించే లౌడ్ స్పీకర్లను మూసివేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఆయన కోరారు. లేకపోతే ఆ మసీదుల ఎదుట లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. “ మసీదులలో లౌడ్ స్పీకర్లను ఎందుకు అంత పెద్ద శబ్దంతో ప్లే చేస్తారు ? దీనిని ఆపకపోతే మసీదుల వెలుపల ఎక్కువ శబ్దంతో హనుమాన్ చాలీసా ప్లే చేస్తాం. ” అని ఏప్రిల్ 2 న శివాజీ పార్క్ వద్ద జరిగిన ర్యాలీలో ఠాక్రే అన్నారు.
తాను ప్రార్థనలకు వ్యతిరేకం కాదని, ప్రజలు తమ ఇళ్లలో ప్రార్థనలు చేసుకోవచ్చని రాజ్ ఠాక్రే అన్నారు. తాను తన సొంత మతం పట్ల గర్వంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా తన బంధువు, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కూడా రాజ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఆయన వ్యతిరేకించిన శక్తులతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఓటర్లకు నమ్మక ద్రోహం చేశారని చెప్పారు. ఇలా ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత అంటే ఏప్రిల్ 3వ తేదీన ముంబైలోని ఘాట్‌కోపర్‌లోని MNS కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా ప్లే చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని దానిని అడ్డుకున్నారు. అనంతరం వారికి జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో వాల్యూమ్ తగ్గించాలని రాజ్ ఠాక్రే ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే, అశోక్ చవాన్, అతుల్ విమర్శించారు. ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. కాగా శ్రీ రాముని జన్మదినానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం చైత్ర నవరాత్రుల చివరి రోజున రామ నవమిని భారతదేశం అంతటా నిర్వహిస్తారు.
