లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే రాహుల్ ప్రసంగంపై కొందరు మండిపడుతున్నారు. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మాత్రం రాహుల్‌కు థాంక్స్ చెప్పారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో రాహుల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు రాహుల్ స్పీచ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతుంటే.. మరికొందరు ఆయన ప్రసంగాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నాయకులు రాహుల్ స్పీచ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మాత్రం రాహుల్‌కు థాంక్స్ చెప్పారు. తమిళ ప్రజల దీర్ఘకాల వాదనలను పార్లమెంట్‌లో వినిపించినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా ట్వీట్ చేశారు.
నిన్న పార్లమెంట్‌లో 45 నమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వం ఫెడరలిజాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మోదీ హయాంలో మళ్లీ రాచరికం ప్రవేశించిందని, మోదీ రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండా కేంద్రం పరిపాలన చేస్తుందన్నారు. ‘మీరు రాజ్యాంగాన్ని చదివితే.. భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా అభివర్ణించారని మీకు తెలుస్తోంది. భారతదేశాన్ని ఒక భావనగా కాకుండా.. రాష్ట్రాల యూనియన్‌గా అభివర్ణించారు. తమిళనాడుకు చెందిన నా సోదరుడికి.. ఉత్తరప్రదేశ్‌కు నా సోదరుడితో సమానమైన హక్కులు ఉండాలనేదే దీని అర్థం’ అని రాహుల్ గాంధీ అన్నారు
‘భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ చర్చలు, సంభాషణల ద్వారా పాలన జరగాలి. నేను తమిళనాడు వెళ్తున్నాను. వారికి ఏమి కావాలో నేను వారిని అడుగుతాను... అప్పుడు వారు ఏమి కావాలో చెబుతారు. చర్చలు ఇలా ఉండాలి. తమిళనాడు ప్రజలను మీరు ఎప్పటికీ పాలించలేరు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య.. మీరు ఇక్కడ రాచరిక వ్యవస్థ ప్రకారం పాలించలేరు’ అని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాహుల్ ప్రసంగంపై స్పందించిన ఎంకే స్టాలిన్.. ‘భారత రాజ్యాంగం భావనను నొక్కిచెప్పడాని మీరు చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగానికి తమిళులందరి తరపున ధన్యవాదాలు. ఆత్మగౌరవానికి విలువనిచ్చే ప్రత్యేక సాంస్కృతిక, రాజకీయ మూలాలపై ఆధారపడిన తమిళ ప్రజల దీర్ఘకాల వాదనలను మీరు పార్లమెంటులో వినిపించారు’ అని ట్వీట్ చేశారు.
