తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈ సోదాలను తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ఖండించారు. 

తమిళనాడు క్యాబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు చేయడంపై సీఎం ఎంకె స్టాలిన్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనలేని దమ్ములేక బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని స్టాలిన్‌ అన్నారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర సచివాలయంపై ఈడీ దాడిని ఖండిస్తూ.. ఫెడరలిజానికి మచ్చ అని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరిపై దాడులు చేశారన్నది ముఖ్యం కాదని, ఎక్కడ రైడ్ చేశారన్నదే ముఖ్యమని సీఎం స్టాలిన్ అన్నారు. 

వెల్లూరులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు, ఆ ఆరోపణలన్నింటికీ తాము తగిన సమాధానం ఇచ్చామనీ, సచివాలయాన్ని ముట్టడించడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధమన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవడానికి బదులు బ్యాక్‌డోర్ పద్ధతుల ద్వారా వారిని బెదిరించే బీజేపీ రాజకీయాలు ఎక్కువ కాలం పనికిరావని అన్నారు. బీజేపీ తన వద్ద ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులను నియంత్రిస్తోందనీ, దీనికి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని ఎంకే స్టాలిన్ అన్నారు.

మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం (జూన్ 13) తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీతో పాటు మరికొంత మంది వ్యక్తుల ప్రాంగణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఈ దాడులపై డీఎంకే సీనియర్‌ నేత బాలాజీ మాట్లాడుతూ.. అధికారులు తన వద్దకు వచ్చి ఏం చేశారో తనకు తెలియదన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. చెన్నై, కరూర్ జిల్లాలోని బాలాజీ ప్రాంగణాల్లో ఈడీ దాడులు చేసింది. బాలాజీకి వ్యతిరేకంగా జరిగిన 'క్యాష్ ఫర్ జాబ్' కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు గత నెలలో పోలీసులు, ఈడీకి అనుమతినిచ్చింది.

ఈడీ సోదాలు ప్రారంభించిన తర్వాత బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏం వెతుకుతున్నారో చూద్దాం.. ఇక అయిపోనివ్వండి. ఆదాయపు పన్ను శాఖ లేదా ఈడీకి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన బాలాజీ.. పత్రాల ఆధారంగా అధికారులు తన నుంచి ఎలాంటి సమాచారం అడిగినా ఇస్తానని చెప్పారు. సోదాలు ప్రారంభమైనప్పుడు మార్నింగ్ వాక్‌లో ఉన్న మంత్రి, తన ప్రాంగణంలో దాడుల గురించి సమాచారం అందుకున్న తర్వాత టాక్సీ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు.