గత తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను అమలు చేసిందో జాబితాను విడుదల చేయాలని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. బీజేపీ ప్రతి రాష్ట్రంలో సమావేశమై కార్యకర్తలను ప్రజల్లోకి చేర్చాలని కోరుతుండగా.. ప్రతిపక్షాలకు చెందిన పలువురు అగ్ర నాయకులు కూడా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అమిత్ షాపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గత తొమ్మిదేళ్లలో తమిళనాడుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాల జాబితాను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ.. UPA హయాంలో (2004-14) అమలు చేసిన అనేక ప్రత్యేక కార్యక్రమాలను జాబితా చేశారు.
జూన్ 11న అమిత్ షా పర్యటన
2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా జూన్ 11న కేంద్ర మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటించనున్నారు. ఈ రాష్ట్ర పర్యటనను ప్రస్తావిస్తూ.. తమిళనాడుకు సంబంధించిన పథకాలను వివరించేందుకు కేంద్ర హోంమంత్రి సిద్ధంగా ఉన్నారా? అని స్టాలిన్ ప్రశ్నించారు. అమిత్ షా వేలూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు అధ్యక్షత వహించనున్నారు.
కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు వ్యయంలో 11 శాతం రాష్ట్రానికి తీసుకురాగా.. చెన్నై మెట్రో రైలు మొదటి దశ పూర్తయిందని తెలిపారు. యూపీఏ హయాంలో తమిళనాడులో 69 ముఖ్యమైన పథకాలు అమలయ్యాయని స్టాలిన్ తెలిపారు.
యూపీఏ హయాంలో 69 ముఖ్యమైన పథకాలు అమలయ్యాయని, తమిళ్‌ను క్లాసికల్ లాంగ్వేజ్‌గా ప్రకటించారనీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ఏర్పాటు చేశామని, తమిళనాడులో రూ.56,664.21 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులు, సేతుసముద్రం ప్రాజెక్టు ప్రారంభించామని సీఎం స్టాలిన్ చెప్పుకోచ్చారు.
ఎయిమ్స్ ప్రాజెక్ట్ ఏమైంది?
2015లో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్ ప్రాజెక్టు ఇంతవరకు అమలు కాలేదని కేంద్ర ప్రభుత్వంపై షా మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు అమలు కాలేదని తమిళనాడు ప్రజల ప్రశ్నిస్తున్నారనీ, ఈ ప్రశ్నకు అమిత్ షా సమాధానం చెప్పాలనీ, ఆయన సమాధానం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
