ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి కనిపించకుండా పోయిందని అందరూ అనుకున్నారు. కానీ తీరా సదరు రోగి..  మరుగుదొడ్డిలోనే ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వారం రోజుల తర్వాత గుర్తించారు. ఈ సంఘటన మహారాష్ట్ర లోని జల్ గావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జల్ గావ్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఇటీవల 82ఏళ్ల వృద్ధురాలు కరోనాకు చికిత్స పొందుతూ కనిపించకుండా పోయారని ఇటీవల ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే.. ఆమె మృతదేహం మరుగుదొడ్డిలో కనపడటంతో అందరూ షాకయ్యారు. అప్పటికే ఆమె చనిపోయి వారం రోజులు అయ్యిందని అధికారులు చెప్పారు.

దీనిని బట్టి సిబ్బంది ఎవరూ కనీసం మరుగుదొడ్లు కూడా శుభ్రం చేయడం లేదని అర్థమయ్యిందని కలెక్టర్ అవినాశ్ ఢకనే పేర్కొన్నారు. సిబ్బంది తోడు లేకుండానే టాయ్ లెట్ కి వెళ్లబోయి ఇటీవల మరో ముగ్గురు కరోనా రోగులు కూడా ప్రాణాలు కోల్పోయారని తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇదిలా ఉండగా.. బాత్రూమ్ లో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలి కోడలు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆమెకు  కనీసం ఆస్పత్రిలోని ఐసీయూలో బెడ్ కూడా దొరకలేదు. దాని కోసం ఎదురు చూస్తుండగానే పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.